సినీ తారలను, క్రికెటర్లకు అభిమానులు లక్షల సంఖ్యలో ఉంటారు. తమకు ఉన్న అభిమానాన్ని ఒక్కోరు ఒక్కోలా చూపిస్తూ ఉంటారు. కాగా... పశ్చిమ బెంగాల్ లోని ఓ హోటల్ లో అయితే... ధోనీ అభిమానంతో ఆయన ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చారు.

పశ్చిమ బెంగాల్‌ అలిపుర్దువార్‌ జిల్లాకు చెందిన శంభూ బోస్‌ మహేంద్ర సింగ్‌ ధోనీకి వీరాభిమాని. అందుకే తన హోటల్‌కు తన ఆరాధ్య క్రికెటర్‌ అయిన ఎం.ఎస్‌. ధోనీ పేరు పెట్టాడు.
 
అంతేకాదు ధోనీ అభిమానులు ఎవరైనా అక్కడ భోజనం చేసినా, టీ లేదా కాఫీ తాగినా వారి వద్ద నుంచి నయా పైసా కూడా తీసుకోడు. ఇంతకీ ‘నువ్వు ధోనీకి ఫ్యాన్‌ ఎలా అయ్యావు?’ అన్న ప్రశ్నకు ‘ధోనీ లాంటి వారు మరొకరు ఉండరు. చిన్నప్పటి నుంచే ధోనీ మీద అభిమానం పెంచుకున్నా. అతడి ఆటతీరు, వ్యక్తిత్వం నాకెంతో ఇష్టం. అతడే నాకు స్ఫూర్తి’’ అని బదులిస్తాడు బోస్‌. నోరూరించే బెంగాలీ వంటకాలను అందించే శంభూ బోస్‌ హోటల్లో ఎక్కడ చూసినా ధోనీ ఫొటోలే కనిపిస్తాయి.

కేవలం హోటల్ లోనే కాదు.. తన ఇంట్లో కూడా ధోనీ ఫోటోలు ఉన్నాయని ఆనందంగా చెప్పుకుంటాడు. ఎప్పటికైనా ధోనిని కలవాలనేది తన చిరకాల కోరిక అని అతను ఈ సందర్భంగా చెప్పాడు. అయితే.. తన కోరిక నెరవేరదన్న విషయం తనకు తెలుసని... ఎందుకంటే స్టేడియానికి వెళ్లి క్రికెట్‌ మ్యాచ్‌లు చూసేంత ఆర్థిక స్తోమత తనకు లేదని చెప్పాడు. ఒకవేళ నేను ధోనీని కలిస్తే, ‘నా హోటల్‌కు రావాల్సిందిగా ధోనీని ఆహ్వానిస్తాను’. మహీకి అన్నం, చేపల కూర అంటే తెగ ఇష్టమని నాకు తెలుసు’ అని చెబుతాడు