ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో ‘LGM’ మూవీ నిర్మిస్తున్న సాక్షి సింగ్... త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ధోనీ బ్యానర్ ఫిల్మ్.. 

మహేంద్ర సింగ్ ధోనీకి సక్సెస్ మంత్ర బాగా అలవడింది. క్రికెటర్‌గా సక్సెస్ సాధించిన తర్వాత కెప్టెన్‌గా సూపర్ సక్సెస్‌ని సొంతం చేసుకున్న మహేంద్రుడు, వ్యవసాయంలోనూ భారీ లాభాలు ఆర్జిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌లో పెట్టుబడులు పెట్టిన ధోనీ, సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించిన పంటలను దేశవిదేశాల్లో విక్రయిస్తున్నాడు..

కడక్‌నాథ్ కోళ్లు, పాల ఉత్పత్తుల వ్యాపారంలో ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ, కొన్ని రోజుల కిందటే సినిమా ప్రొడక్షన్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ధోనీ భార్య సాక్షికి సినిమాలంటే భలే పిచ్చి. దీంతో ‘ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ పేరుతో ఓ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్‌ని ప్రారంభించిన సాక్షి ధోనీ, ఈ బ్యానర్‌లో మొదటి సినిమాగా ‘LGM’(Lets Get Married) ని నిర్మించింది..

Scroll to load tweet…

తెలుగులో ‘కాదలి’, ‘జెర్సీ’ వంటి సినిమాల్లో నటించిన హరీశ్ కళ్యాణ్, ఈ సినిమాలో హీరోగా నటిస్తుంటే ‘లవ్‌ టుడే’ సినిమాతో యూత్‌లో బీభత్సమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న ఇవాన హీరోయిన్‌గా నటిస్తోంది. నదియా, రోగి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఇప్పటికే విడుదలై, మంచి అటెన్షన్ దక్కించుకుంది.

జూన్ 10న చెన్నైలో ‘LGM’ మూవీ ట్రైలర్ రిలీజ్, ఆడియో రిలీజ్ వేడుక జరగనుంది. ఈ కార్యక్రమం కోసం మహేంద్ర సింగ్ ధోనీ, సాక్షి సింగ్ కలిసి చెన్నై చేరుకున్నారు. ఐపీఎల్ 2023 సీజన్ టైటిల్ గెలిచిన తర్వాత చెన్నైలో అడుగుపెట్టిన ధోనీకి బ్రహ్మాండమైన స్వాగతం లభించింది.

మాహీని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు, చెన్నై ఎయిర్‌పోర్ట్‌కి తరలివచ్చారు. మాహీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌కి, క్రేజ్‌కి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే చాలు, సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించడం ఖాయం. ఒకవేళ ఈ సినిమాలో మాహీ చిన్న పాత్రలో కనిపిస్తే, టాక్‌తో సంబంధం లేకుండా ధోనీ ఫ్యాన్స్, థియేటర్‌కి పరుగులు పెడతారు..

‘మంచి కథ, కథనం ఉన్న కథలతో సినిమాలు తీయాలని అనుకుంటున్నాం. ఈ సినిమాతో కొత్త కెరీర్‌ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఇంటిల్లిపాదీ ఆనందంగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ చూసేలా ఉంటుంది.. ’ అంటూ కామెంట్ చేశాడు సాక్షి సింగ్ ధోనీ..

ఐపీఎల్ 2022 సీజన్‌లో 14 మ్యాచుల్లో నాలుగే విజయాలు అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్, 2023 సీజన్‌లో ధోనీ కెప్టెన్సీలో ఐదో టైటిల్ గెలిచింది. 42 ఏళ్ల మహేంద్ర సింగ్ ధోనీ, మోకాలి గాయంతో బాధపడుతూనే 2023 సీజన్ మొత్తం ఆడాడు. 2024 సీజన్‌లో ధోనీ ఆడతాడా? లేదా? అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు..