Asia Cup 2025 Trophy: భారత క్రికెట్ ముందు పీసీబీ మొహ్సిన్ నఖ్వీ తలవంచారు. లాహోర్ వెళ్లే ముందు దుబాయ్‌లో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు ఆసియా కప్ ట్రోఫీని అప్పగించినట్లు సమాచారం. ఇప్పుడు భారత్ ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ట్రోఫీని అందుకోనుంది.
Asia Cup 2025 Trophy: ఆసియా కప్ 2025 ట్రోఫీ చుట్టూ కొనసాగుతున్న డ్రామా మరో మలుపు తీసుకుంది. మ్యాచ్ తర్వాత మొదలైన వివాదం ఇప్పుడు బోర్డు రూమ్‌లు, కౌన్సిల్ సమావేశాలకు పాకింది. వాడీవేడి మీటింగ్స్ తర్వాత నఖ్వీ దిగొచ్చారు. భారత్ కు క్షమాపణలు చెప్పిన ఆయన.. తాజాగా ట్రోఫీ విషయంలో కూడా వెనక్కి తగ్గారు.
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ఛైర్మన్, పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీకి వ్యతిరేకంగా బీసీసీఐ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కానీ తాజా పరిణామంలో, ఆ ట్రోఫీ ఇప్పుడు నఖ్వీ దగ్గర లేదని తెలుస్తోంది. ఎన్డీటీవీ నివేదిక ప్రకారం, నఖ్వీ లాహోర్ వెళ్లే ముందు దుబాయ్‌లో ఆసియా కప్ ట్రోఫీ, పతకాలను ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB)కు అప్పగించారు.
సెప్టెంబర్ 28న నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించడానికి భారత్ నిరాకరించడంతో, ఆ సింబాలిక్ కప్‌ను ఆయన తనతోనే ఉంచుకున్నారు. ఇప్పుడు అది యూఏఈ బోర్డు భద్రతలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నఖ్వీ ట్రోఫీని తన దగ్గరే ఉంచుకుంటారనే ఆందోళనలు తగ్గాయి. అయినా, భారత్‌కు ట్రోఫీని ఎప్పుడు, ఎలా అప్పగిస్తారనే దానిపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. నివేదిక ప్రకారం, ట్రోఫీని బీసీసీఐ ప్రధాన కార్యాలయానికి పంపడం లేదా దుబాయ్‌లో భారత ప్రతినిధి సేకరించడం వంటివి జరిగే అవకాశం ఉంది.
నక్వీ తీరుపై బీసీసీఐ తీవ్ర అభ్యంతరం
సెప్టెంబర్ 28న ఫైనల్ తర్వాత జరిగిన గందరగోళంలో, నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించడానికి భారత్ నిరాకరించడంతో, ఏసీసీ చీఫ్ పతకాలు, కప్‌ను తనతో తీసుకెళ్లారు. ఆసియా కప్ విజేత ట్రోఫీని భారత్‌కు అందించకపోవడంపై మంగళవారం జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏజీఎంలో బీసీసీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
"మ్యాచ్ తర్వాత అవార్డుల కార్యక్రమంలో ఏసీసీ ఛైర్మన్ (నఖ్వీ) ట్రోఫీని అందించకుండా చేసిన డ్రామాపై ఏసీసీ సమావేశంలో భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది" అని ఒక ఏసీసీ అధికారి తెలిపినట్టు పీటీఐ నివేదిక పేర్కొంది. నఖ్వీ "ఇప్పటికీ ట్రోఫీని ఇవ్వడానికి అంగీకరించలేదు" అని ఆ అధికారి ఇంతకుముందు తెలిపారు.
ఏసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో భారత్ తరఫున ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, మాజీ కోశాధికారి ఆశిష్ షెలార్ పాల్గొన్నారు. ట్రోఫీని అర్హులైన విజేతలుగా భారత్‌కు తిరిగి ఇవ్వాలని ఇద్దరూ పట్టుబట్టారు.
"గెలిచిన జట్టుకు ట్రోఫీని అప్పగించాలని శుక్లా, షెలార్ స్పష్టంగా చెప్పారు. ఇది ఏసీసీ ట్రోఫీ, ఒక వ్యక్తికి చెందినది కాదు. ఆయన బాధ్యతను నక్వీ దాటవేస్తున్నారు" అని ఆ అధికారి తెలిపారు.
అయితే, నఖ్వీ ఈ సమస్యను ఏజీఎంలో చర్చించవద్దని సూచిస్తూ, దానిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు. ఈ ఉద్రిక్తత మధ్య వైస్ ఛైర్మన్‌ను ఎన్నుకునే ఏకైక అజెండా కూడా వాయిదా పడింది.
భారత్ ఆసియా కప్ విజయంపై నఖ్వీ మౌనం
భారత్ ఆసియా కప్ విజయంపై నఖ్వీ మౌనంగా ఉండటం భారత ప్రతినిధులకు మరింత ఆగ్రహం తెప్పించింది. ఈ సమావేశం ప్రారంభ ప్రసంగంలో, వెస్టిండీస్‌పై విజయం సాధించినందుకు నేపాల్‌ను, ఏసీసీలో చేరినందుకు మంగోలియాను అభినందించారు, కానీ భారత్ టైటిల్ విజయాన్నినఖ్వీ ప్రస్తావించలేదు.
"సమావేశం ప్రారంభమైనప్పుడు, ఛైర్‌పర్సన్ (నఖ్వీ) తన ప్రారంభ ప్రసంగంలో నేపాల్, మంగోలియాను అభినందించి ముగించారు. అప్పుడే షెలార్ 'ఆసియా కప్ టైటిల్ గెలిచిన భారత్‌ను ఎందుకు మీరు అభినందించడం లేదు?' అని ప్రశ్నించారు. భారత్ ఒత్తిడితో ఆయన ఆ తర్వాత అభినందించారు" అని ఆ అధికారి వివరించారు.
"ఏసీసీ ట్రోఫీని కార్యాలయంలో ఉంచాలని, బీసీసీఐ దానిని తీసుకుంటుందని శుక్లా, షెలార్ వాదించారు. 'మేము అసలైన విజేతలుగా ట్రోఫీని అందుకోవాలనుకుంటున్నాము' అని వారు చెప్పారు. నఖ్వీ అదే సమయంలో కాదు అనకుండా బాధ్యతను దాటవేస్తున్నారు" అని ఆ అధికారి వివరించారు. పరిష్కారం లభించకపోతే నవంబర్‌లో ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్తామని కూడా బీసీసీఐ సంకేతాలు ఇచ్చింది.
ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ వివాదాలు
భారత్, పాకిస్థాన్ మధ్య ఆసియా కప్ లో పలు వివాదాలు కొనసాగాయి. ఫైనల్ లో పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది భారత్. ఆ తర్వాత ఈ ట్రోఫీ డ్రామా మొదలైంది. ఆసియా కప్ అంతటా పాకిస్థానీ ఆటగాళ్లతో భారత్ 'నో హ్యాండ్‌షేక్ పాలసీ'ని పాటించింది. అదే సమయంలో, 26 మంది పర్యాటకులను బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాక్ పై ఆగ్రహంతో ఉంది. ఈ దాడి తర్వాత భారత్ ఉగ్రవాద శిబిరాలను కూల్చివేయడానికి ‘ఆపరేషన్ సింధూర్’ ను ప్రారంభించింది. ఆ తర్వాత భారత్ పాక్ సంబాధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
