Asia Cup 2025 : ఎట్టకేలకు బిసిసిఐ పంతం నెగ్గించుకుంది. పాకిస్థాన్ మంత్రి చేతులమీదుగా ఆసియా కప్ ట్రోఫీ అందుకోలేదు కదా ఏసిసి ఛైర్మన్ గా ఉన్న అతడితో క్షమాపణలు చెప్పించుకుంది.
Asia Cup 2025 : ఆసియా కప్ 2025 టోర్నీ వివాదానికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీమిండియా ఈ మెగా టోర్నీలో విజయం సాధించినా ట్రోఫీ అందుకోలేదు. ప్రస్తుతం ఈ కప్ పాకిస్థాన్ మంత్రి, ఆసియా కప్ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ వద్దే ఉంది. ఈ వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో వివాదంగా మారడంతో అతడు చిక్కుల్లో పడ్డాడు. దీంతో ఇలా వ్యవహరించినందుకు నఖ్వీ బిసిసిఐని క్షమాపణలు కోరినట్లు తెలుస్తోంది.
ఆసియా కప్ ట్రోఫీ అప్పగించేందుకు నఖ్వీ కండీషన్స్
అయితే ఆసియా కప్ 2025 మెగా టోర్నీలో విజయం సాధించిన భారత్ కు ట్రోఫీని అప్పగించేందుకు మాత్రం అతడు మెలికలు పెడుతున్నట్లు తెలుస్తోంది. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు మాత్రమే ఈ కప్ ను అప్పగిస్తానని... అతడే స్వయంగా తన (ఏసిసి) కార్యాలయానికి వచ్చి ట్రోపీ అందుకోవాలని కోరుతున్నట్లు సమాచారం. దీనికి బిసిసిఐ ఆమోదయోగ్యంగా లేదు... లీగల్ గా పోరాడి ఈ ట్రోఫీని ఎలా తెచ్చుకోవాలతో తమకు తెలుసని బిసిసిఐ ప్రతినిధులు అంటున్నారు. నఖ్వీ తీరుపై ఐసిసి ఫిర్యాదు చేసేందుకు బిసిసిఐ సిద్దమయ్యింది.
నఖ్వీపై చర్యలు తప్పవా?
ఇప్పటికే ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ ఏజిఎం మీటింగ్ లో మొహ్సిన్ నఖ్వీ వ్యవహారతీరుపై బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆసియా కప్ ట్రోఫీని గెలిచిన జట్టుకు ఇవ్వకుండా క్రీడాస్పూర్తిని దెబ్బతీసేలా ఏసిసి ప్రెసిడెంట్ వ్యవహరించాడని... అదేమీ అతడి సొత్తు కాదని రాజీవ్ శుక్లా ఘాటుగానే రియాక్ట్ అయినట్లు సమాచారం.
ఇలా బిసిసిఐ సీరియస్ అవుతుండటం... ఐసిసి చర్యలు తీసుకునే అవకాశాలు ఉండటంతో నఖ్వీ దిగివచ్చాడు... క్షమాపణలు చెప్పి ట్రోఫీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. కానీ ఇంకొంచెం ఈగో ప్రదర్శిస్తూ తన చేతులమీదుగానే కేవలం టీమిండియా కెప్టెన్ కు మాత్రమే ట్రోఫీ అప్పగిస్తానని అంటున్నాడట మొహ్సిన్ నఖ్వీ. అతడి కండిషన్స్ కి భారత్ ససేమిరా అంటోంది.
