లబుషేన్‌ని పడుకోనివ్వని మహ్మద్ సిరాజ్... బౌన్సర్లతో అటాక్ చేస్తూ! వాళ్లు చేసిన దానికి నాపై పగ బడితే ఎలా?
రెండో ఇన్నింగ్స్ ఆరంభానికి ముందు బాల్కనీలో కునుకుతీస్తూ కనిపించిన మార్నస్ లబుషేన్... సిరాజ్ బౌన్సర్ల దెబ్బకు కిందపడిపోయి...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023లో ఆస్ట్రేలియా డామినేషన్ ఎక్కువ అయినా టీమిండియా ఫ్యాన్స్ కూడా కాస్తో కూస్తో ఎంజాయ్ చేస్తున్నారు. తొలి రెండు రోజుల్లో ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం కనబర్చినా మూడో రోజు తొలి సెషన్‌లో అజింకా రహానే, శార్దూల్ ఠాకూర్ హాఫ్ సెంచరీలతో రాణించి... భారత జట్టు పరువు కాపాడారు...
ఈ ఇద్దరి పోరాటం కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకి ఆలౌట్ అయ్యింది టీమిండియా. శార్దూల్ ఠాకూర్‌ని టార్గెట్ చేస్తూ బౌన్సర్లతో విరుచుకుపడ్డారు ఆసీస్ బౌలర్లు ప్యాట్ కమ్మిన్స్, స్కాట్ బోలాండ్. అయితే వికెట్లకు అడ్డుగా నిలబడిపోయిన శార్దూల్ ఠాకూర్.. అజింకా రహానేతో కలిసి ఏడో వికెట్‌కి 109 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించారు...
శార్దూల్ ఠాకూర్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మహ్మద్ సిరాజ్, ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అవుట్ అయినట్టుగా అంపైర్ ప్రకటించాడు. వెంటనే డీఆర్‌ఎస్ తీసుకున్నా, సిరాజ్ అవుట్ అయినట్టు ఫిక్స్ అయిపోయిన ఆస్ట్రేలియా టీమ్, డగౌట్‌కి చేరుకుంది.
అయితే టీవీ రిప్లైలో బంతి బ్యాటుకి తగులుతున్నట్టు కనిపించడం, థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడంతో ఆస్ట్రేలియా టీమ్ మళ్లీ ఫీల్డింగ్‌కి రావాల్సి వచ్చింది..
ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్‌కి జరిగిన దానికి రెండో ఇన్నింగ్స్‌లో మహ్మద్ సిరాజ్ ప్రతీకారం తీర్చుకుంటున్నట్టు కనిపించాడు. ఓపెనర్లు బ్యాటింగ్ చేస్తుంటే వన్‌డౌన్‌లో రావాల్సిన మార్నస్ లబుషేన్, సోఫాలో తాపీగా కునుకుతీస్తూ కనిపించాడు.
లబుషేన్ అలా కునుకు తీశాడో లేదో డేవిడ్ వార్నర్‌ని అవుట్ చేసిన మహ్మద్ సిరాజ్... అతన్ని వెంటనే బ్యాటింగ్‌కి రప్పించాడు. బౌన్సర్లతో లబుషేన్‌కి స్వాగతం పలికాడు మహ్మద్ సిరాజ్.. రెండో బంతికే సిరాజ్ వేసిన బంతి, లబుషేన్ చేతికి బలంగా తాకింది. దెబ్బకు బ్యాటు పడేసిన లబుషేన్, నొప్పితో విలవిలలాడాడు..
ఆ తర్వాత ఇన్నింగ్స్ పదో ఓవర్‌లో మరోసారి సిరాజ్ వేసిన బంతి, బలంగా లబుషేన్ చేతి వేళ్లను తాకింది.. ఆ తర్వాత బంతి ఆడేందుకు ప్రయత్నించిన లబుషేన్, ఏకంగా కింద పడిపోయాడు.. సిరాజ్ ఎంతగా ఇబ్బంది పెట్టినా క్రీజులో కుదురుకుపోయిన మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్‌తో కలిసి మూడో వికెట్‌కి 50+ భాగస్వామ్యం నెలకొల్పాడు..
ఓపెనర్లు డేవిడ్ వార్నర్ 1, ఉస్మాన్ ఖవాజా 13 పరుగులు చేసి వెంటవెంటనే అవుటైనా ఈ ఇద్దరూ క్రీజులో కుదురుకుపోవడంతో ఆస్ట్రేలియా ఆధిక్యం ఇప్పటికే 250+ పరుగులను దాటేసింది..