Mohammed Shami: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీకి ఈమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. రూ. 1 కోటి ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

Mohammed Shami receives death threat: భారత క్రికెట్ జట్టు స్టార్ పేసర్ మహమ్మద్ షమీకి బెదిరింపులు వచ్చాయి. అతన్ని చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. సోమవారం ఈమెయిల్ ద్వారా బెదిరింపు సందేశం వచ్చింది. బెదిరింపులతో పాటు రూ.1 కోటి డిమాండ్ చేశారు. ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న షమీకి రూ.1 కోటి ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. ఇటీవలే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కి కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. దీనిపై దర్యాప్తు జరిగింది. ఇప్పుడు షమీకి కూడా ఇలాగే బెదిరింపులు వచ్చాయి.

మీడియా కథనాల ప్రకారం.. షమీకి ఒక ఈమెయిల్ వచ్చింది. అందులో రూ.1 కోటి ఇవ్వకపోతే చంపేస్తామని రాసి ఉంది. ఈ విషయంపై షమీ సోదరుడు మహమ్మద్ హసీబ్ అమ్రోహా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈమెయిల్ గురించి చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. షమీకి ఈమెయిల్ రాజ్‌పుత్ సింధర్ పేరుతో వచ్చింది. ఆ మెయిల్‌లో ప్రభాకర్ అని పేరు ఉంది.

నిందితుల కోసం అమ్రోహా పోలీసుల గాలింపు

ఈ కేసు దర్యాప్తులో అమ్రోహా పోలీసులు పూర్తిగా నిమగ్నమయ్యారు. సైబర్ సెల్‌కి ఈమెయిల్‌ని పంపించారు. ఈ మెయిల్ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వచ్చిందని షమీ సోదరుడు భావిస్తున్నారు. వెంటనే అమ్రోహా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగి, ఈమెయిల్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఐపీఎల్ 2025లో SRH తరపున ఆడుతున్న షమీ

మహమ్మద్ షమీ ప్రస్తుతం ఐపీఎల్ 18వ సీజన్‌లో బిజీగా ఉన్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతున్నాడు. పాయింట్ల పట్టికలో SRH 10 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 7 ఓటములతో 6 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. షమీ బౌలింగ్ కూడా పెద్దగా ప్రభావం చూపించడం లేదు. మొత్తం 9 మ్యాచ్‌లు ఆడి 6 వికెట్లు మాత్రమే తీసుకున్నారు.

ఐపీఎల్ 2025లో షమీ ప్రదర్శన బాగలేకపోవడంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరి మట్లాడుతూ అతనికి మద్దతుగా నిలిచాడు. షమీ ఫిట్‌నెస్ గురించి వస్తున్న ఊహాగానాలను ఖండిస్తూ, అతను పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని స్పష్టం చేశాడు. 

"ఫిట్‌నెస్ విషయంలో మాకు ఎలాంటి అనుమానాలు లేవు. అతను బాగా ట్రెయిన్ అయ్యాడు, తగిన విధంగా సిద్ధమయ్యాడు," అని వెట్టోరి ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపారు. అలాగే, షమీ గతంలో చేసిన అద్భుత ప్రదర్శనలను వెట్టోరి గుర్తుచేశారు. ఐపీఎల్ 2023లో షమీ పర్పుల్ క్యాప్ గెలుచుకుని, 28 వికెట్లు తీసిన ఘనతను సాధించాడని ఆయన గుర్తు చేశారు.