మహమ్మద్ సిరాజ్... ఆస్ట్రేలియా సిరీస్ ఆరంభానికి ముందే తండ్రిని కోల్పోయిన ఈ హైదరాబాదీ, క్రికెట్ కోసం కన్నతండ్రి కడసారి చూపులకు కూడా నోచుకోలేదు. డెడికేషన్‌తో భారతీయుల మనసు దోచుకున్న ఈ హైదరాబాదీ, ఇప్పుడు తన ప్రవర్తనతో ఆస్ట్రేలియన్ల హృదయాలకు దగ్గరయ్యారు.

మొదటి ప్రాక్టీస్ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన కామెరూన్ గ్రీన్... రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడ్డాడు. రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా... 123 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దశలో సిరాజ్‌తో కలిసి పదో వికెట్‌కి 71 పరుగులు జోడించాడు జస్ప్రిత్ బుమ్రా.

57 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచిన బుమ్రా... భారత జట్టు పరువు నిలిపాడు.గ్రీన్ బౌలింగ్‌లో స్ట్రైయిక్ బౌండరీ కొట్టే ప్రయత్నం చేశాడు బుమ్రా. ఆ బంతి నేరుగా బౌలర్ కామెరూన్ గ్రీన్‌కి తగిలింది. గ్రీన్‌కి బంతి తాకిన విషయాన్ని గమనించిన నాన్‌స్ట్రైయికర్ సిరాజ్... బ్యాటు పడేసి ఏం అయ్యిందో చూసేందుకు హడావుడిగా పరుగెత్తాడు.

మరోవైపు షాట్ కొట్టిన బుమ్రా మాత్రం సింగిల్ తీసేందుకు ప్రాధాన్యం ఇచ్చాడు. దీంతో బుమ్రాను ట్రోల్ చేస్తూ, సిరాజ్‌ను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు చాలామంది. అయితే షాట్ కొట్టిన బుమ్రా, బంతి తగలకుండా కామెరూన్ గ్రీన్ అడ్డంగా చెయ్యి పెట్టుకోవడం చూశాడని, అందుకే పెద్ద గాయం కాదని గ్రహించాడని అంటున్నారు కొందరు.

ప్రత్యర్థి ఆటగాడికి ఏం అయ్యిందోనని ఆరాటంతో పరుగెత్తిన సిరాజ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది.