వార్మప్ మ్యాచ్‌లో హ్యాట్రిక్! వరల్డ్ కప్ అనగానే బీభత్సమైన ఫామ్‌లోకి వచ్చేసిన మిచెల్ స్టార్క్...
నెదర్లాండ్స్‌తో వార్మప్ మ్యాచ్‌లో హ్యాట్రిక్ తీసిన మిచెల్ స్టార్క్.. వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దు అయిన వార్మప్ మ్యాచ్..
కొందరు ద్వైపాక్షిక సిరీసుల్లో బాగా ఆడతారు. మరికొందరు ఐపీఎల్‌లో మాత్రమే బాగా ఆడతారు. మిచెల్ స్టార్క్ మాత్రం ఐసీసీ వరల్డ్ కప్ అంటే చాలు, చెలరేగిపోతాడు. వరల్డ్ కప్ కోసం ఐపీఎల్‌కి కూడా దూరంగా ఉంటున్న మిచెల్ స్టార్క్.. నెదర్లాండ్స్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో హ్యాట్రిక్ తీశాడు..
తిరువనంతపురంలో జరిగిన ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ మధ్య వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా 23 ఓవర్లకు కుదించారు అంపైర్లు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, 23 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది..
బ్యాటింగ్ ఆర్డర్‌లో రకరకాల ప్రయోగాలు చేసింది ఆసీస్. స్టీవ్ స్మిత్‌తో కలిసి జోష్ ఇంగ్లీష్ ఓపెనింగ్ చేశాడు. జోష్ ఇంగ్లీష్ డకౌట్ కాగా స్టీవ్ స్మిత్ 42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. అలెక్స్ క్యారీ 25 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 28 పరుగులు చేశాడు.
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 5, కామెరూన్ గ్రీన్ 34 పరుగులు, ప్యాట్ కమ్మిన్స్ 1, మాథ్యూ షార్ట్ 5 పరుగులు చేయగా మిచెల్ స్టార్క్ 22 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 24 పరుగులు చేశాడు.
167 పరుగుల లక్ష్యఛేదనలో మొదటి ఓవర్‌లోనే నెదర్లాండ్స్‌కి షాక్ తగిలింది. మొదటి ఓవర్ ఐదో బంతికి మ్యాక్స్ ఓడాడ్‌ని అవుట్ చేసిన మిచెల్ స్టార్క్, ఆ తర్వాతి బంతికి వెస్లీ బర్రాసీని అవుట్ చేశాడు. మూడో ఓవర్ తొలి బంతికి బస్ దే లీడే కూడా అవుట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ అవుట్ చేసిన ఈ ముగ్గురూ కూడా గోల్డెన్ డకౌట్ కావడం విశేషం..
విక్రమ్ జీత్ 9, సైబ్రాండ్ ఎగెల్‌బ్రెచ్ 9, స్కాట్ ఎడ్వర్డ్స్ 14 పరుగులు చేయగా కోలిన్ అకీర్‌మాన్ 37 బంతుల్లో 3 ఫోర్లతో 31 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 14.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది నెదర్లాండ్స్. ఈ దశలో మరోసారి వర్షం కురవడంతో మ్యాచ్‌ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అంపైర్లు..
3 ఓవర్లు బౌలింగ్ చేసిన మిచెల్ స్టార్క్, 18 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. మిచెల్ మార్ష్, సీన్ అబ్బాట్, లబుషేన్‌లకు తలా ఓ వికెట్ దక్కింది.