మూడో టెస్టులో ఇరగదీసిన కమ్‌బ్యాక్ హీరోలు... మిచెల్ మార్ష్ సూపర్ సెంచరీ, 5 వికెట్లు తీసిన మార్క్ వుడ్, క్రిస్ వోక్స్‌కి 3 వికెట్లు...
తొలి రెండు టెస్టుల్లో నెగ్గి, యాషెస్ సిరీస్‌లో 2-0 ఆధిక్యాన్ని అందుకున్న ఆస్ట్రేలియా, మూడో టెస్టుని కూడా తొలి రోజు ఆధిక్యంతో ఆరంభించింది. మొదటి రెండు టెస్టుల్లో ఓడిన ఇంగ్లాండ్, మూడో టెస్టులో మూడు మార్పులతో బరిలో దిగింది..
సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్‌తో పాటు జోష్ ఠంగ్, ఓల్లీ పోప్‌లని తుది జట్టు నుంచి తప్పించిన ఇంగ్లాండ్, మొయిన్ ఆలీతో పాటు మార్క్ వుడ్, క్రిస్ వోక్స్‌లకి అవకాశం కల్పించింది.
ఆస్ట్రేలియా కూడా మూడో టెస్టులో మూడు మార్పులు చేసింది. గాయంతో యాషెస్ సిరీస్ నుంచి తప్పుకున్న నాథన్ లియాన్ ప్లేస్‌లో టాడ్ ముర్ఫీకి అవకాశం ఇచ్చిన ఆస్ట్రేలియా... జోష్ హజల్‌వుడ్‌తో పాటు కామెరూన్ గ్రీన్‌ని రిజర్వు బెంచ్‌కి పరిమితం చేసింది. వీరి స్థానంలో స్కాట్ బోలాండ్, మిచెల్ మార్ష్ తుది జట్టులోకి వచ్చారు..
డేవిడ్ వార్నర్ 4, ఉస్మాన్ ఖవాజా 13, మార్నస్ లబుషేన్ 21 పరుగులు చేసి అవుట్ కాగా 100వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న స్టీవ్ స్మిత్ 31 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసి స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో 85 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా..
అయితే చాలా రోజుల తర్వాత టెస్టు టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన మిచెల్ మార్ష్ 118 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్సర్లతో 118 పరుగులు చేసి టెస్టు కెరీర్‌లో మూడో సెంచరీ అందుకున్నాడు. ట్రావిస్ హెడ్‌తో కలిసి ఐదో వికెట్‌కి 155 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన మిచెల్ మార్ష్, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..
74 బంతుల్లో 5 ఫోర్లతో 39 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ కూడా క్రిస్ వోక్స్ బౌలింగ్‌లోనే అవుట్ కాగా అలెక్స్ క్యారీ 8, మిచెల్ స్టార్క్ 2, టాడ్ ముర్ఫీ 13 పరుగులు చేశారు. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ డకౌట్ కావడంతో 60.4 ఓవర్లలో 263 పరుగులకి ఆలౌట్ అయ్యింది ఆస్ట్రేలియా..
తొలి రెండు టెస్టుల్లో ఆడని మార్క్ వుడ్ 11.4 ఓవర్లలో 34 పరుగులిచ్చి 5 వికెట్లు తీయగా క్రిస్ వోక్స్ 3 వికెట్లు తీశాడు. స్టువర్ట్ బ్రాడ్‌కి 2 వికెట్లు దక్కాయి. అయితే ఆసీస్‌ని తక్కువ స్కోరుకే కట్టడి చేశామనే ఆనందం ఇంగ్లాండ్‌కి ఎక్కువ సేపు నిలవలేదు..
బెన్ డక్లెట్ 2, హారీ బ్రూక్ 3 పరుగులు చేసి ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో అవుట్ కాగా 33 పరుగులు చేసిన జాక్ క్రావ్లేని మిచెల్ మార్ష్ పెవిలియన్ చేర్చాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది ఇంగ్లాండ్. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకి ఇంకా 195 పరుగులు వెనకబడి ఉంది ఇంగ్లాండ్.. జో రూట్ 19, జానీ బెయిర్ స్టో 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. రెండో రోజు ఇంగ్లాండ్ చేసే స్కోరు, మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేయనుంది..
