ఇంకా ఐపిఎల్ ఆరంభమే కాలేదు అప్పుడే టోర్నీ విజేతలను ప్రకటించాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్.  కేవలం ఐపిఎల్ ట్రోపిని అందుకునే జట్టునే కాదు...ఉత్తమ బౌలర్, ఉత్తమ బ్యాట్ మెన్ నిలిచే ఆటగాళ్లు ఎవరో కూడా ముందే ప్రకటించి సంచలనం రేపారు. భారత యువ ఆటగాళ్లు ఈ ఐపిఎల్ లో సత్తా చాటి చరిత్ర సృష్టించనున్నారని వాన్ ప్రకటించారు. 

విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపిఎల్12 సీజన్ విజేతగా నిలుస్తుందని వాన్ పేర్కొన్నారు. ఈ విషయంలో అభిమానులకు ఎలాంటి సందేహం అవసరం లేదన్నారు. ఐపిఎల్ చరిత్రను తిరగరాస్తూ ఆర్సీబి విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. 

కోహ్లీ, డివిలియర్స్ వంటి స్టార్లతో నిండివున్న ఆర్సిబి జట్టు ఇప్పటివనకు ఒక్కసారి కూడా ఐపిఎల్ ట్రోపి సాధించలేకపోయింది. లీగ్ దశలో అద్భుతంగా ఆడే ఈ జట్టుకు క్వార్టర్, సెమి ఫైనల్స్ లో చతికిల పడటం పరిపాటిగా మారింది. ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలని పట్టుదలతో వున్న ఆర్సిబి ఆటగాళ్లకు వాన్ మాటలు మరింత బలాన్నిచ్చాయి. 

ఇక ఆటగాళ్ల విషయానికి డిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు, యువ కెరటం రిషబ్ పంత్ అత్యుత్తమంగా రాణించి ఆరెంజ్ క్యాప్ అందుకోనున్నాడని వెల్లడించారు. అలాగే కోల్ కతా నైట్ రైడర్స్ యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అధిక వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ గెలుచుకుంటాడని వాన్ జోస్యం చెప్పారు.