ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత నిలకడగా రాణిస్తున్న జట్లలో ఒకటి సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌. బౌలింగ్‌ బలంతో అద్భుత విజయాలు సాధించే సన్‌ రైజర్స్‌.. తాజా సీజన్‌లో బోణీ కోసం ఆరాటపడుతోంది. 

తొలి రెండు మ్యాచుల్లో విజయాలను ఖాతాలో వేసుకునే సువర్ణావకాశాలను ఆరెంజ్‌ ఆర్మీ జారవిడిచింది. టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌ మెన్‌ డగౌట్‌కు చేరగానే.. మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ వికెట్లు ఇచ్చేందుకు పోటీపడుతున్నారు. 

ఫలితంగా సన్‌ రైజర్స్‌ సీజన్‌లో బోణీ కొట్టనేలేదు. రెండు ఓటములతో కుంగిపోయిన హైదరాబాద్‌ నేడు బలమైన ముంబయి ఇండియన్స్‌ తో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో ఓడినా.. కోల్‌కతపై తిరుగులేని విజయం సాధించింది ముంబయి. 

గత ఐదు మ్యాచుల్లో ముంబయి, హైదరాబాద్‌ చెరో రెండు మ్యాచుల్లో విజయాలు సాధించాయి. ఓ మ్యాచ్‌ టై కాగా.. సూపర్‌ ఓవర్‌లో ముంబయి విజేతగా నిలిచింది. నేటి మ్యాచ్‌లో ముంబయిపై విజయంతో బోణీ కొట్టేందుకు సన్‌ రైజర్స్‌ సిద్ధమవుతోంది.

కానీ సన్ రైజర్స్ ఈ మ్యాచులో విజయం సాధించాలంటే బ్యాటింగ్ విభాగంలో మరింత కష్టించాల్సి ఉంటుంది. భీకరమైన ముంబై బ్యాటింగ్ ని సం రైజర్స్ బౌలర్లు ఏ మేర కట్టడి చేయగలుగుతారో కూడా వేచి చూడాలి. 

టీం కూర్పులో కూడా సన్ రైజర్స్ ఇబ్బంది పడుతుంది. బెయిర్ స్టో, కేన్ విలియంసన్ లలో ఎవరిని తీసుకోవాలనేదానిపై ఇంకా ఒక క్లారిటీకి జట్టు యాజమాన్యం వచ్చినట్టుగా కనబడడం లేదు. ఒకవైపేమో భీకర ఫామ్ లో ఉన్న జానీ, మరోవైపు చెన్నై పిచ్ పై నేర్పుగా బ్యాటింగ్ చేయగల కేన్. వీరిలో ఎవరిని తీసుకోవాలనే విషయంలో ఒకింత తర్జనభర్జన పడుతున్నట్టుగా కనబడుతుంది. 

నబీ, హోల్డర్ ల విషయంలో కూడా అదే సందిగ్ధత నెలకొంది. ఇవి పక్కనుంచితే మనీష్ పాండే ఆటతీరు మరో తలనొప్పిగా తయారయింది. క్రీజులో కుదురుకుని ఉన్నప్పటికీ... వేగంగా మాత్రం ఆడలేకపోతున్నాడు. 

మొన్న మనీష్ పాండే స్లో ఆటతీరును వీరేంద్ర సెహ్వాగ్ సైతం తూర్పారబట్టిన విషయం తెలిసిందే. కానీ మిడిల్ ఆర్డర్ లో పాతుకుపోగల ఒక బ్యాట్స్ మన్ మాత్రం దొరికినట్లయిందని సంతోషపడాలో.... లేదా స్లో ఆటతీరు కలిగి ఉన్నందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితి హైదరాబాద్ అభిమానులది. 

మిడిల్ ఆర్డర్ ని బలపర్చడంతోపాటు ఒక ఫినిషర్ అవసరం హైదరాబాద్ కి ఉంది. ఆ రోల్ లో హోల్డర్, నబీలలో ఒకరిని, మిడిల్ ఆర్డర్ బలోపేతం కోసం విలియంసన్, బెయిర్ స్టో లలో ఒకరిని తీసుకోవాలి. ఇదే ఇప్పుడు కత్తిమీద సాములా మారింది.