సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానున్న ఐపీఎల్ 2020 సీజన్‌కు సంబంధించి అన్ని జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. తాజాగా ముంబై ఆటగాళ్ల నెట్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ షేర్ చేసింది.

ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ తనలోని ఫీల్డింగ్ టాలెంట్‌ని బయటపెట్టాడు. ప్రాక్టీస్ సందర్భంగా మొదటి రెండు బంతులను సాదాసీదాగా అందుకున్న రోహిత్... మూడో బంతిని మాత్రం ఎడమ పక్కకు ఒరిగి ఒంటి చేత్తో డ్రైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.

కెప్టెన్సీ, బ్యాటింగ్‌తో పాటు తనలో మంచి ఫీల్డర్ ఉన్నాడని రోహిత్ కామెంట్ చేశాడు. లీగ్‌లో మొదటి మ్యాచ్ సెప్టెంబర్‌ 19న చెన్నై సూపర్‌ కింగ్స్‌, డిపెడింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ మధ్య జరగనున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే నాలుగు సార్లు టైటిల్ విజేతగా నిలిచిన ముంబైపై ఈసారి భారీ అంచనాలున్నాయి. అయితే స్టార్ బౌలర్ లసిత్ మలింగ దూరం కావడం కొంచెం ఇబ్బందిగా మారొచ్చు.

రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్‌కు క్రిస్‌లిన్, క్వింటాన్ డీకాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషాన్‌లతో బ్యాటింగ్ ఆర్డర్ బలంగా వుంది. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో హార్డిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్‌లు జట్టులో ఉండటం అదనపు బలం.

ఇక బౌలింగ్ విభాగంలో జస్‌ప్రీత్ బుమ్రా, మిచెల్ మెక్లీన్‌గన్‌తో పాటు ట్రెంట్ బౌల్డ్, కౌల్టర్ నైల్ రూపంలో నాణ్యమైన పేసర్లు అందుబాటులో ఉన్నారు.