రోహిత్ శర్మ... ముంబై ఇండియన్స్ జట్టును మరోసారి ఐపిఎల్ విజేతగా నిలిపిన సక్సెస్ ఫుల్ కెప్టెన్.  విరాట్ కోహ్లీ వంటి సీనియర్ కెప్టెన్ ఒక్క ఐపిఎల్ ట్రోఫీని కూడా సాధించలేక సతమతపడుతుంటే రోహిత్ మాత్రం ఏకంగా తన  ఖాతాలో నాలుగో ఐపిఎల్ ట్రోఫీని వేసుకున్నాడు. ఐపిఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కే కాదు టీమిండియా కు తన సారథ్యంలో ఎన్నో విజయాలను అందించి సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా ధోని పేరుతెచ్చుకున్నాడు. అలాంటి సీనియర్ సారథిని వెనక్కినెట్టి రోహిత్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సారథుల్లో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. 

ఇప్పటివరకు ధోని ఖాతాలో కేవలం 3 ఐపిఎల్ ట్రోఫీలుండగా రోహిత్ ఆ రికార్డును  బద్దలుగొట్టి నాలుగో ట్రోఫీని అందుకున్నాడు. అయితే అందరూ అనుకున్నట్లు రోహిత్ కు ఇది నాలుగో ఐపిఎల్ ట్రోఫీ కాదట. ఈ విషయాన్ని స్వయంగా  ఆయనే వెల్లడించాడు. 

ఐపిఎల్ ఫైనల్లో  చెన్నైపై విజయం సాధించి ట్రోఫీని అందుకున్న అనంతరం రోహిత్ ప్రసంగించాడు. ఇది  ముంబై సారథిగా తనకు నాలుగో టైటిల్ అని...ఓ ఆటగాడిగా అయితే ఐదో ట్రోఫీ అని తెలిపాడు. 2013,2015,2017, 2019 లలో ముంబై ఇండియన్స్..2009 తో డెక్కన్ చార్జర్స్ తరపున ఈ ట్రోఫిని ముద్దాడే అవకాశం తనకు వచ్చిందని వెల్లడించాడు. ఈ ఐదు తనకెంతో ప్రత్యేకమైనవని రోహిత్ తెలిపాడు. 

ఐపిఎల్ సీజన్ 12 ఫైనల్లో వీరోచితంగా పోరాడి తక్కువ పరుగులను కాపాడుకుని ముంబై విజయాన్ని అందుకుంది. నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఈ మ్యాచ్ లో 150 పరుగుల లక్ష్యానికి కేవలం రెండు పరుగుల దూరంలో నిలిచి సీఎస్కే ఐపిఎల్ ట్రోఫిని చేజార్చుకుంది.  చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్ ఒంటరిగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ముంబై బౌలర్ లసిత మలింగ చివరి ఓవర్లో మాయ చేసి ముంబై ఇండియన్స్ ని  కేవలం ఒక్క పరుగు తేడాతో విజయాన్ని అందించాడు. ఈ గెలుపు కోసం కెప్టెన్ గా రోహిత్ రచించిన వ్యూహాలు, కీలక సమయంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రశంసలు కురుస్తున్నారు.