ఐపిఎల్ 2019 తొలి మ్యాచ్ లోనే టీమిండియా యువకెరటం రిషబ్ పంత్ అదరగొట్టిన విషయం  తెలిసిందే. పటిష్టమైన బౌలింగ్ విభాగాన్ని కలిగిన ముంబై ఇండియన్స్ పై పంత్ చెలరేగి డిల్లీ  క్యాపిటల్స్  విజయంలో కీలక పాత్ర పోషించాడు. తమ ఓటమికి రిషబ్ పంత్ సుడిగాలి ఇన్నింగ్సే కారణమని ముంబై  జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అంగీకరించారు. అతడు అద్భుతంగా  ఆడి తమ చేతుల్లోని విజయాన్ని లాక్కున్నాడని రోహిత్ అన్నాడు.

ఆదివారం డిల్లీ-ముంబై  మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ... మ్యాచ్ ఆరంభంలో తాము  పటిష్ట స్థితిలోనే వున్నామన్నారు. పది ఓవర్ల వరకు అంతా బాగానే సాగిందని...ఆ తర్వాతే మెల్లిమెల్లిగా మ్యాచ్ తమ చేతుల్లోంచి జారిపోయిందన్నారు. రిషబ్ పంత్ రాకతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. తాము మ్యాచ్ కు ముందు గెలుపు కోసం కొన్ని ప్రణాళికలను రూపొందించామని... వాటిని సరిగ్గా అమలతు చేయలేకపోవడం వల్లే ఓటమిపాలయ్యామని అన్నారు.. తర్వాతి మ్యాచుల్లో ఇలాంటి తప్పులు జరక్కుండా జాగ్రత్త పడతామని  రోహిత్ పేర్కొన్నారు. 

ముంబై జట్టులో యువరాజ్ అద్భుతంగా ఆడాడని ప్రశంసించాడు. హాప్ సెంచరీతో ఆకట్టుకున్న అతడు మిగతా మ్యాచుల్లో కూడా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. తాము ఇంకో 70  పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్సి వుంటే మ్యాచ్ ఫలితం మరోలా వుండేదని రోహిత్ అభిప్రాయపడ్డారు. 

ఆదివారం ముంబై-డిల్లీ జట్ల మధ్య జరిగిన  మ్యాచ్ లో డిల్లీ క్యాపిటల్స్ 37 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన డిల్లీ జట్టులో రిషబ్ పంత్ (27 బంతుల్లో 78 నాటౌట్; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) సూపర్ షో తో ఆకట్టుకున్నాడు. దీంతో నిర్ణీత ఓవర్లలో క్యాపిటల్స్ జట్టు 213 పరుగులు చేసింది. ఇలా  214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు విజయం ముందు చతికిలపడింది. లక్ష్యఛేదనలో యువరాజ్ (35 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించినా విజయ తీరాలకు చేర్చలేకపోయాడు.