సచిన్ టెండూల్కర్... ఎన్నో ఏళ్ల క్రికెట్ అనుభవం. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు. భారతీయులకు క్రికెట్ దేవుడు. చిన్నప్పటి నుండి క్రికెట్ తోనే మమేకమైన సచిన వంటి ఆటగాడికి కూడా అర్థం కాని సంఘటన ఓ క్లబ్ క్రికెట్లో చోటుచేసుకుంది. ఆ వీడియోను తన ట్విట్టర్ అకౌట్లో  పోస్ట్ చేసిన సచిన్ తన అనుమానాన్ని నివృత్తి చేయాలంటూ అభిమానులకు పెద్ద పరీక్ష పెట్టాడు.  

సచిన్ పోస్ట్ చేసిన వీడియో ఏదో క్లబ్ క్రికెట్లో చోటుచేసుకున్న సంఘటన. అందులో బౌలర్ విసిరిన బంతి నేరుగా వెళ్లి వికెట్లపై వుండే బెయిల్స్ ను అలా కదిలిస్తూ వెళ్లింది. ఇలా బంతి తగలగానే బెయిల్ అమాంతం కింద పడకుండా పక్కకు జరిగి ఒకే వికెట్ పై వుండిపోయింది. దీంతో బౌలర్ ఔట్ ఇవ్వాల్సిందిగా అంపైర్ కు అప్పీల్ చేశాడు. 

అయితే అంపైర్ మాత్రం వెంటనే నిర్ణయాన్ని ప్రకటించకుండా కొద్దిసేపు ఆలోచించాడు. చివరకు బెయిల్ కిందపడలేదు కాబట్టి నాటౌట్ గా ప్రకటించాడు. అనంతరం పక్కన జరిగి ఒకే  స్టంప్ పై వాలిన బెయిల్ ను సరిచేశాడు. 

ఈ వీడియోను పోస్ట్ చేస్తూ సచిన్ అభిమానులకు ఈ విధంగా ప్రశ్నించాడు.  '' ఓ స్నేహితుడు  నాకు  ఈ  వీడియోను షేర్ చేశాడు. ఇందులో చోటుచేసుకున్న పరిణామం చాలా అసహజమైంది. ఆ సందర్భంలో మీరే అంపైర్ గా వుంటే ఎలాంటి  నిర్ణయం తీసుకుంటారు?'' అంటూ తనను కన్స్యూజ్ చేసిన వీడియోను సచిన్ అభిమానులతో పంచుకున్నాడు.