300 స్కోర్ల చేయడం వన్డేల్లో సాధ్యమే.. గతంలో 400 పైచిలుకు స్కోర్లు చేయడం కూడా చూశాం. అయితే కేవలం 20 ఓవర్లు మాత్రమే ఉండే టీ20లలో 300 పరుగుల స్కోరు అన్నది ఊహించడం కూడా కష్టమే.

ఈ క్రమంలో దీనిని చేసి నిరూపించారు ఉగండా క్రికెటర్లు, అది కూడా మహిళలు. రువాండలోని కిగలి పట్టణంలో జరుగుతున్న క్విబుక విమెన్స్ టీ20 టోర్నమెంట్‌లో..ఉగండా-మాలి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఉగండా బ్యాటింగ్ ఎంచుకుంది.

ఓపెనర్లు చెలరేగి ఆడి 5.4 ఓవర్లలోనే 82 పరుగులు చేశారు. ఓపెనర్ నకిసుయి అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన 20 ఏళ్ల కెప్టెన్ రీటా ముసమాలి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది.

మరో ఓపెనర్ అలకోతో కలిసి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడింది. 71 బంతుల్లో 15 ఫోర్లతో అలకో 116 పరుగు చేయగా..ముసమాలి 61 బంతుల్లో 103 పరుగులు చేసింది. వీరిద్దరి జోరుతో ఉగండా 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది.

భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన మాలి జట్టు 11.1 ఓవర్లలో పది పరుగులకే అలౌట్ అయ్యింది. ఇంత భారీ స్కోరు నమోదైన మ్యాచ్‌లో ఒకే ఒక్క సిక్సర్ ఉండగా.. 61 ఎక్సట్రాలు ఉన్నాయి. ఇందులో 30 నోబాల్స్, 28 వైడ్లు ఉన్నాయి. మరోవైపు అంతర్జాతీయ పురుషుల, మహిళా టీ20 చరిత్రలో ఇదే అత్యధిక స్కోరుగా రికార్డుల్లోకి ఎక్కింది.