Asianet News TeluguAsianet News Telugu

దక్షిణాఫ్రికా క్రికెట్లో వివక్ష: కన్నీళ్లు పెట్టిస్తున్న ఎన్తిని దీన గాథ

యువ పేసర్‌ లుంగి ఎంగిడి సఫారీ క్రికెట్‌లో 'బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌' నినాదం అందుకోగా అందుకు మిశ్రమ స్పందన లభించింది. తాజాగా సఫారీ దిగ్గజ క్రికెటర్‌ ముఖాయ ఎన్తిని దక్షిణాఫ్రికాలో వేళ్లూనుకుపోయిన జాతి వివక్షపై గళమెత్తాడు.
 

Makhaya Ntini opens up about time in South African team
Author
Durban, First Published Jul 18, 2020, 3:07 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

జాతి వివక్ష ఉద్యమం నెమ్మదిగా దక్షిణాఫ్రికా క్రికెట్‌కు కూడా పాకుతోంది. క్రికెట్‌లో వర్ణ వివక్షపై తొలుత వెస్టిండీస్‌ క్రికెటర్లు గళం విప్పగా, ఆలస్యంగానైనా సఫారీ క్రికెట్‌లో స్పందన మొదలైంది. యువ పేసర్‌ లుంగి ఎంగిడి సఫారీ క్రికెట్‌లో 'బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌' నినాదం అందుకోగా అందుకు మిశ్రమ స్పందన లభించింది. తాజాగా సఫారీ దిగ్గజ క్రికెటర్‌ ముఖాయ ఎన్తిని దక్షిణాఫ్రికాలో వేళ్లూనుకుపోయిన జాతి వివక్షపై గళమెత్తాడు.

దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష బీజాలు.... 

1996 రగ్బీ ప్రపంచకప్‌కు ముందు రోజులవి. ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా రగ్బీ మ్యాచ్‌. సహజంగా సఫారీ అభిమానులు ఆ దేశ జట్టుకు మదతుగా నిలవాలి. కానీ స్టేడియంలోని దక్షిణాఫ్రికా అభిమానులు ఆస్ట్రేలియా జట్టుకు బ్రహ్మరథం పట్టారు. దక్షిణాఫ్రికా పరాజయాన్ని వేడుకగా చేసుకున్నారు. ఆ ఒక్క మ్యాచే కాదు, మూడు దశాబ్దాల క్రితం దక్షిణాఫ్రికా క్రీడల్లో ఇదే పరిస్థితి. క్రికెట్‌, రగ్బీ తెల్ల జాతీయుల జట్టుగా.. ఫుట్‌బాల్‌ నల్లజాతీయుల జట్టుగా ఉండేది. 

దక్షిణాఫ్రికా నల్ల జాతీయులు ఎవరూ ఆ దేశ క్రికెట్‌, రగ్బీ జట్టుకు మద్దతుగా నిలిచేవారు కాదు. చారిత్రక ఎన్నికల్లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఎన్నికైన నెల్సన్‌ మండేలాకు దేశంలో వర్ణ విభజన గురించి బాగా తెలుసు. అధికారం అందుకున్న తర్వాత ప్రతీకార రాజకీయాలు, నల్లవారికి అనుకూలమైన నిర్ణయాలను క్రీడా రంగంపై రుద్దే ప్రయత్నం ఏనాడూ చేయలేదు. క్రీడా రంగంలో విప్లవాత్మక రిజర్వేషన్లకు ముందు.. వర్ణ భేదాలతో చీలిపోయిన దక్షిణాఫ్రికా దేశాన్ని ఐక్యం చేసేందుకు క్రీడలనే మార్గంగా ఎంచుకున్నాడు. 

1996 రగ్బీ ప్రపంచకప్‌ సఫారీ జట్టులో ఒకే ఒక్క నల్ల జాతీయుడికి చోటు లభించింది. అధ్యక్షుడిగా మండేలా స్వయంగా జట్టు ప్రాక్టీస్‌ సెషన్లకు వెళ్లి ఉత్సాహపరిచాడు. మండేలా చూపిన చొరవ గొప్ప ఫలితాలు ఇచ్చింది. విభేదాలు మరిచి దక్షిణాఫ్రికా రగ్బీ ప్రపంచకప్‌ విజయాన్ని (ఫైనల్లో బలమైన న్యూజిలాండ్‌పై గెలుపొందింది) ఐక్యంగా సంబురం చేసుకుంది. అనంతరం దక్షిణాఫ్రికా క్రీడల్లో రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు. 

ఫలితంగానే క్రికెట్‌, రగ్బీ సహా ఇతర జాతీయ జట్లలోకి నల్ల జాతీయులు ప్రవేశించారు. రిజర్వేషన్ల ఫార్ములా దక్షిణాఫ్రికా క్రీడల్లో పెను మార్పులు తీసుకొచ్చింది. దక్షిణాఫ్రికా మరుపురాని విజయాలు సొంతం చేసుకుంది. సమాన అవకాశాల సాధనకు రిజర్వేషన్లు ఉపయోగపడినా.. వ్యవస్థీకృతంగా ఉన్న జాతి వివక్ష సమాజం నుంచి అంత సులువగా తుడిచివేయబడలేదు. జాతీయ జట్లలో నల్ల జాతీయులను చేర్చుకున్నా.. తోటి తెల్లజాతి ఆటగాళ్లు వారిని ఎన్నడూ సహచర, సోదర భావంతో చూడలేదనే చేదు నిజం ఆలస్యంగా వెలుగులోకి వస్తోంది!. దక్షిణాఫ్రికా క్రికెట్‌ దిగ్గజం మకియ ఎన్తిని సఫారీ డ్రెస్సింగ్‌రూమ్‌లో తనకు ఎదురైన అనుభవాలను తాజాగా పంచుకున్నాడు.

దక్షిణాఫ్రికా క్రికెట్‌ కెరీర్‌లో నేను ఎల్లప్పుడూ ఒంటరివాడిగానే మిగిలిపోయానని ఎన్తిని అన్నాడు. షాన్‌ పొలాక్‌, జాక్వస్‌ కలిస్‌, మార్క్‌ బౌచర్‌, లాన్స్‌ క్లుసెనర్‌ వంటి స్టార్‌ క్రికెటర్లతో కలిసి మకియ ఎన్తిని సుదీర్ఘ కాలం దక్షిణాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించాడు.

దక్షిణాఫ్రికా క్రికెట్‌లో నేను ఎల్లప్పు డూ ఒంటరిగానే ఫీలయ్యాను. డిన్నర్‌ కోసం ఏ ఒక్కరూ నా గది తలుపు కొట్టినవారు లేరు. బయటికి వెళ్లేందుకు నా ముందే ప్లాన్‌ చేసుకునేవారు, నన్ను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఉదయం అల్పాహారం చేసేందుకు వెళ్తే, నా దగ్గరకు వచ్చి ఎవరూ కూర్చునేవారు కాదు. 

మేము అందరం ఒకే యూనిఫామ్‌ వేసుకున్నాం, ఒకే జాతీయ గీతం పాడాం. కానీ నేను ఐసోలేషన్‌ను అధిగమించాల్సి వచ్చింది. అందుకోసం నేను టీమ్‌ బస్సులో ప్రయాణం చేసేవాడిని కాదు. బస్‌ డ్రైవర్‌ను చూసి నా బ్యాగ్‌ అతడికి ఇచ్చేవాడిని. స్టేడియానికి పరుగు తీస్తూ వెళ్లేవాడిని. 

తిరుగు ప్రయాణంలోనూ అదేవిధంగా రన్నింగ్‌ చేస్తూ హౌటల్‌కు చేరుకునేవాడిని. నేను అలా ఎందుకు చేస్తున్నానో ప్రజలకు అర్థమయ్యేది కాదు. ఒంటరి తనాన్ని అధిగమించేందుకే అలా చేశానని నేనెవరికి చెప్పలేదు. నిజానికి నాకు అది గొప్ప అలవాటుగా మారింది. 

టీమ్‌ బస్‌లో నేను వెనకాల కూర్చుంటే అందరూ ముందు వరుసలోకి వెళ్లేవారు. నేను ముందు కూర్చుం టే అందరూ వెనకాల సీట్లలోకి వెళ్లేవారు. జట్టు గెలిచినప్పుడు అందరం సంతోషంగా ఉండేవారు. ఓడినప్పుడు నన్ను మాత్రమే బాధ్యుడి చేస్తూ నిందలు వేసేవారు. జాతి వివక్ష నాతోనే ముగియలేదు, నా కొడుకు థండోకూ ఇది తప్పలేదు. తప్పుడు కారణాలతో అండర్‌-19 క్యాంప్‌ నుంచి నా కొడుకును తప్పించేందుకు చూశారు' అని దక్షిణాఫ్రికా బ్రాడ్‌కాస్ట్‌ కార్పొ రేషన్‌ (ఎస్‌ఏబీసీ)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మకయ ఎన్తిని వెల్లడించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios