Asianet News TeluguAsianet News Telugu

కౌంటీల్లో సెంచరీతో చెలరేగిన శుబ్‌మన్ గిల్... సౌతాఫ్రికా సిరీస్‌లో చోటు ఖాయమేనా...

గ్లామోర్గన్ టీమ్ తరుపున కౌంటీల్లో తొలి సెంచరీ సాధించిన శుబ్‌మన్ గిల్... సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో ఓపెనర్‌గా గిల్‌! 

Maiden hundred for Shubman Gill in county cricket, before India vs South Africa series
Author
First Published Sep 27, 2022, 4:21 PM IST

కౌంటీ ఛాంపియన్‌షిప్ 2022 టోర్నీలో భారత ప్లేయర్లు అదిరిపోయే పర్ఫామెన్స్‌ ఇస్తూ స్పెషల్ అట్రాక్షన్‌గా మారుతున్నారు. ఛతేశ్వర్ పూజారా అదిరిపోయే పర్ఫామెన్స్‌తో సుసెక్స్ క్లబ్‌కి రికార్డు లెవెల్ పర్ఫామెన్స్ ఇవ్వగా జయంత్ యాదవ్, నవ్‌దీప్ సైనీ, ఉమేశ్ యాదవ్ వంటి ప్లేయర్లు కూడా మంచి పర్ఫామెన్స్ కనబర్చారు. తాజాగా ఈ లిస్టులో శుబ్‌మన్ గిల్ కూడా చేరిపోయాడు...


గ్లామోర్గన్ టీమ్ తరుపున ఆడుతున్న శుబ్‌మన్ గిల్, సుసెక్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిపోయాడు. 123 బంతుల్లో కౌంటీల్లో మొట్టమొదటి సెంచరీ మార్కును అందుకున్న శుబ్‌మన్ గిల్, 139 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 119 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

గ్లామోర్గాన్ కెప్టెన్ 64 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 56 పరుగులు చేసి అవుట్ కాగా ఎడ్వర్డ్ బేరామ్ 23 బంతుల్లో 4 ఫోర్లతో 21 పరుగులు చేశాడు. సామ్ నార్త్‌ఈస్ట్ 13, బిల్లీ రూట్ 21 పరుగులు చేసి పెవిలియన్ చేరారు...
56 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది గ్లామోర్గాన్...

కౌంటీ ఛాంపియన్‌షిప్ 2022 మరో రెండు రోజుల్లో ముగియనుంది. సెప్టెంబర్ 29న కౌంటీ ఛాంపియన్‌షిప్‌ ముగిసిన తర్వాత స్వదేశం చేరుకునే శుబ్‌మన్ గిల్, సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో పాల్గొనే అవకాశం ఉంది. శిఖర్ ధావన్ కెప్టెన్సీలో సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది టీమిండియా...

ఈ వన్డే సిరీస్‌కి త్వరలో జట్టును ప్రకటించబోతోంది బీసీసీఐ. రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్ వంటి ప్లేయర్లకు ఈ వన్డే సిరీస్‌లో చోటు దక్కుతుందని సమాచారం. వీరితో పాటు ఐపీఎల్ 2022 సీజన్‌లో సెంచరీతో చెలరేగి, దేశవాళీ క్రికెట్ టోర్నీల్లోనూ మంచి పర్ఫామెన్స్ చూపించిన యంగ్ ఆల్‌రౌండర్ రజత్ పటిదార్‌కి సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో పిలుపు దక్కబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి...

కెఎల్ రాహుల్ గాయపడడం, రోహిత్ శర్మ రెస్ట్ తీసుకోవడంతో వన్డేల్లో ఓపెనర్‌గా మారిన శుబ్‌మన్ గిల్, ఈ అవకాశాలను చక్కగా వాడుకున్నాడు. టీమిండియా తరుపున 9 వన్డేలు ఆడి 71.29 సగటుతో 499 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో సెంచరీ సాధించాడు...
 

సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌తో శుబ్‌మన్ గిల్ ప్రేమాయణం నడిపిస్తున్నాడని చాలా రోజులుగా వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై క్లారిటీ రాకముంటే బాలీవుడ్ హీరోయిన్ సారా ఆలీ ఖాన్‌తో ఓ రెస్టారెంట్‌లో కనిపించాడు శుబ్‌మన్ గిల్. అయితే సారా టెండూల్కర్, లేదా సారా ఆలీ ఖాన్... శుబ్‌మన్ గిల్‌కి సారా అనే పేరు బాగా కలిసి వచ్చిందని మీమ్స్ తెగ వైరల్ అయ్యాయి. 

సచిన్ టెండూల్కర్ అల్లుడు కాకపోతే బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ అల్లుడిగా మారేందుకు శుబ్‌మన్ గిల్ పెద్ద ప్లానింగే వేస్తున్నాడని మీమ్స్ తెగ వైరల్ అయ్యాయి.. 

Follow Us:
Download App:
  • android
  • ios