మహేంద్ర సింగ్ ధోని... క్రికెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ ఈ పేరు సుపరిచితమే. మొదట్లో జులపాల జుట్టుతో ఆ తర్వాత ధనాధన్ షాట్లు, సక్సెస్‌ఫుల్ కెప్టెన్సీ, కళ్లుచెదిరే వికెట్ కీపింగ్ ఇలా  ఒక్కోదశలో ఒక్కో విధంగా అభిమాలను  ఆకట్టుకున్నాడు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా  క్రికెట్ ప్రియులు అతడంటే పడిచస్తుంటే ధోని మాత్రం లేటెస్ట్ వాహనాలంటే పడిచస్తుంటాడు. దీంతో ఇప్పటికే అతడి గ్యారేజీలో విభిన్న మోడల్స్ కు చెందిన వాహనాలుండగా మరో లేటెస్ట్ మోడల్ ఇటీవలే చేరిన విషయం తెలిసిందే. 

ధోని ఇటీవల వెస్టిండిస్ పర్యటనను వదులుకుని మరీ భారత ఆర్మీలో దాదాపు పదిహేను రోజుల పాటు పనిచేశాడు. ఈ సమయంలోనే అతడి ఇంటికి కొత్త రెడ్ బీస్ట్ గ్రాండ్ చెరోకి ట్రాక్ హావ్క్ ఎస్‌యూవీ చేరింది. ఈ విషయాన్ని ధోని భార్య ఇన్ట్సాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.

తాజాగా ఆ వాహనాన్ని రోడ్డుపై పరుగెత్తిస్తూ ధోని  అభిమానుల కంటపడ్డాడు. ముందే అతడంటే  పడిచచ్చే అభిమానులు ఈ స్టైలిష్ కారులో షికారు చేస్తున్న ధోనిని ఫోటోల్లో బంధించారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముందు ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ  చక్కర్లు  కొడుతూ వైరల్ గా మారాయి.

ఈ మోడల్ కారును పొందిన మొదటి భారతీయుడిగా ధోని రికార్డు సృష్టించాడు. అలాగే భారత దేశంలో ఈ మోడల్ కారు ఇదొక్కటే వుందట. ఈ రెడ్ బీస్ట్ మోడల్ ను రూ.1.12కోట్లకు ధోని కొనుగోలు చేశాడట. అదునాతన సదుపాయాలు, ఆకట్టుకునే ఫీచర్లతో  కూడిన ఈ రెడ్ బీస్ట్ ధోని గ్యారేజీకి మరింత ప్రత్యేకంగా  మార్చింది.