Lucknow Super Giants Mother's Day Jersey: శనివారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్-కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరుగబోయే మ్యాచ్ లో కెఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో ఆటగాళ్లు ప్రత్యేకమైన జెర్సీలలో ఆడనున్నారు.
ఐపీఎల్ లో మరి కాసేపట్లో లక్నో-కోల్కతా మధ్య కీలక పోరు జరుగనున్నది. ఈ మ్యాచ్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్లు ప్రత్యేకమైన జెర్సీతో బరిలోకి దిగనున్నారు. ఆదివారం (మే 8) మదర్స్ డే ను పురస్కరించుకుని ఆ జట్టు ఆటగాళ్లు.. కేకేఆర్ తో మ్యాచ్ లో వారి తల్లి పేరు గల జెర్సీని ధరించనున్నారు. మదర్స్ డే సందర్భంగా తల్లులకు తాము ఇచ్చే నివాళి అని లక్నో సూపర్ జెయింట్స్ తన ట్విటర్ లో వెల్లడించింది.
ఈ మ్యాచ్ లో లక్నో జట్టు సారథి కెఎల్ రాహుల్ తన తల్లి రాజేశ్వరి పేరుతో ఉండే జెర్సీని ధరించనున్నాడు. అవేశ్ ఖాన్ (షబీనా ఖాన్), కృనాల్ పాండ్యా (నళిని), దీపక్ హుడా (జజ్బీర్ హుడా) రవి బిష్ణోయ్ (సోహ్ని దేవి), అయుష్ బదోని (విభా బదోని) ల పేర్లతో ఉండే జెర్సీలను ధరించనున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియోను లక్నో తన ట్విటర్ ఖాతాలో పంచుకుంది. ‘అమ్మా.. ఇది నీకోసం..’ అని వీడియోలో రాసుకొచ్చింది. ఇదిలాఉండగా.. లక్నో తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఆదివారం తాము సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆడబోయే మ్యాచులో తమ రెగ్యులర్ జెర్సీతో కాకుండా గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగనుంది. పచ్చదనం, చెట్ల పెంపకం వంటి విషయాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు గాను ఆర్సీబీ.. ‘గో గ్రీన్’ అనే నినాదంతో హరిత వర్ణం లో ఉండే జెర్సీని ధరించనుంది.
కాగా.. లక్నో-కేకేఆర్ ల మధ్య జరిగే పోరు కోల్కతా కు అత్యంత కీలకం. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఆ జట్టు.. ఈ మ్యాచ్ తో పాటు మిగిలిన మ్యాచులను తప్పకుండా గెలవాలి. 10 మ్యాచులలో 4 మాత్రమే నెగ్గి 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న కేకేఆర్.. ఈ మ్యాచ్ లో ఓడితే ముంబై, చెన్నై తర్వాత ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించే మూడో జట్టు అవుతుంది.
ఇక ఇప్పటికే 10 మ్యాచుల్లో 7 గెలిచి 3 ఓడిన లక్నో.. 14 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నా దానికి ప్లేఆఫ్ చేరాలంటే మరో విజయం కావాల్సిందే. తదుపరి మ్యాచ్ కోసం వేచి చూడకుండా నేడే కేకేఆర్ ను ఓడించి బెర్త్ ఖాయం చేసుకోవాలని లక్నో భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య హోరాహోరి పోరు తప్పదు అని అభిమానులు భావిస్తున్నారు.
