TATA IPL 2022: ఐపీఎల్-15 లో ముంబై ఇండియన్స్ పై వరుసగా రెండు మ్యాచుల్లో సెంచరీలు బాదడమే గాక రెండుసార్లు విజయం సాధించిన లక్నో సూపర్ జెయింట్స్ సారథి కెఎల్ రాహుల్ కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు షాకిచ్చింది.
లక్నో సారథి కెఎల్ రాహుల్ తో పాటు ఆ జట్టు మొత్తానికి బీసీసీఐ భారీ షాకిచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా రాహుల్ తో పాటు మొత్తం జట్టుపై కూడా జరిమానా విధించింది. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో రాహుల్ సేన.. స్లో ఓవర్ రేట్ కారణంగా ఈ జరిమానా విధిస్తున్నట్టు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. రాహుల్ కు రూ. 24 లక్షల జరిమానాతో పాటు జట్టులోని ప్రతి సభ్యుడి మ్యాచ్ ఫీజులో రూ. 6 లక్షలు కోత పడనున్నది. ఈ సీజన్ లో రాహుల్ తో పాటు ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ కూడా రెండు సార్లు స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ ఫీజులలో కొంత భాగం కోల్పోయాడు.
రాహుల్ కు స్లో ఓవర్ రేట్ కారణంగా ఈ సీజన్ లో జరిమానా విధించడం ఇదే రెండోసారి. ఇక ఇదే తప్పు మళ్లీ కంటిన్యూ అయితే గనక అతడికి రూ. 30 లక్షల జరిమానా తో పాటు ఒక మ్యాచ్ లో నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేగాక తుది జట్టులోని ప్రతి ఆటగాడికి రూ. 12 లక్షల జరిమానా విధిస్తారు.
స్లో ఓవర్ రేట్ అంటే..?
- ఐసీసీ నిబంధనల ప్రకారం.. టీ20లలో బౌలింగ్ చేసే జట్టు గంటకు 14.11 ఓవర్లు వేయాలి. వన్డేలలో ఇది 14.28 గా, టెస్టులలో 15 ఓవర్లుగా ఉంది.
- గంట 25 నిమిషాలలో టీ20 మ్యాచ్ లో ఒక ఇన్నింగ్స్ ముగియాలి.
- అయితే ఈ నిబంధనలను పాటించడంలో లక్నో సూపర్ జెయింట్స్ విఫలమైంది. 85 నిమిషాలలో ఇన్నింగ్స్ ను పూర్తి చేయలేదు.
స్లో ఓవర్ రేట్ శిక్షలు :
- స్లో ఓవర్ రేట్ తొలి సారి నమోదైతే తొలిసారి కెప్టెన్ కు రూ. 12 లక్షల జరిమానా
- రెండో సారి అయితే కెప్టెన్ కు రూ. 14 లక్షలు జరిమానా. తుది జట్టులోని ప్రతి ఆటగాడి మ్యాచ్ ఫీజులో 25 శాతం మ్యాచ్ ఫీజులో కోత.
- మూడోసారి రిపీట్ అయితే కెప్టెన్ వంద శాతం మ్యాచ్ ఫీజుతో పాటు ఒక మ్యాచ్ లో నిషేధం. జట్టులోని మిగతా సభ్యుల మ్యాచ్ ఫీజులలో 50 శాతం కోత.
ఇక లక్నోతో ముంబై మ్యాచ్ విషయానికొస్తే.. ఈ సీజన్ లో వరుసగా ఎనిమిదో ఓటమిని నమోదు చేసింది రోహిత్ సేన.ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ముంబై.. లక్నోను 168 పరుగులకే కట్టడి చేసింది. కెఎల్ రాహుల్ (103) సెంచరీతో మెరిశాడు. అనంతరం ముంబై. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు మాత్రమే చేసింది. రోహిత్ శర్మ (39) టాప్ స్కోరర్. 36 పరుగుల తేడాతో లక్నో ఈ సీజన్ లో ముంబై పై వరుసగా రెండో సారి గెలిచింది.
