LSG Owner Meets UP CM: భారీ ధర వెచ్చించి ఐపీఎల్ లో లక్నో ఫ్రాంచైజీని దక్కించుకున్న లక్నో సూపర్ జెయింట్స్.. రాబోయే సీజన్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో..
ఐపీఎల్-2022 సీజన్ లో అరంగ్రేటం చేయనున్న లక్నో సూపర్ జెయింట్స్ జట్టు.. ఆ మేరకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నది. ఇప్పటికే కోట్లాది రూపాయలు వెచ్చించి టీమ్ ను తయారుచేసుకున్న లక్నో.. మార్చి చివరివారంలో ప్రారంభం కాబోయే ఐపీఎల్-15 సీజన్ కోసం సిద్ధమవుతున్నది. ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) అదినేత సంజీవ్ గొయెంకా తో పాటు ఆ జట్టు సలహాదారు గౌతం గంభీర్ కలిసి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ను కలిశారు. ఈ ఐపీఎల్ లో లక్నో ఫ్రాంచైజీ కొత్తగా ఎంట్రీ ఇవ్వనుండటంతో ఈ ముగ్గురి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో తీరిక లేని షెడ్యూల్ లో ఉన్న యోగి.. ఈ ఇద్దరినీ కలిసేందుకు ఆసక్తి చూపించారు. సీఎంతో భేటీ సందర్భంగా సంజీవ్ గొయెంకా, గంభీర్ లు యోగితో కాసేపు ముచ్చటించారు. లక్నో నగరానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా.. ఐపీఎల్ లో బాగా రాణించాలని యోగి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గొయెంకా, గంభీర్ లు కలిసి యోగికి బ్యాట్ అందజేశారు.
లక్నో సూపర్ జెయింట్స్ కొన్న మొదటి బ్యాట్ ను యోగికి అందజేస్తున్న ఫోటోను ఆ జట్టు ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. ‘లక్నో సూపర్ జెయింట్స్ మొదటి బ్యాట్ ను యోగి ఆదిత్యానాథ్ కు అందజేశాం. ఆయన మాకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు..’ అని ట్విట్టర్ లో రాసుకొచ్చింది.
కాగా రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా లక్నో.. కెఎల్ రాహుల్, మార్కస్ స్టోయినిస్, రవి బిష్ణోయ్ లను రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే ముగిసిన ఐపీఎల్ వేలంలో లక్నో ఫ్రాంచైజీ.. క్వింటన్ డికాక్, ఆవేశ్ ఖాన్, మార్క్ వుడ్, జేసన్ హోల్డర్ వంటి ఆటగాళ్లను దక్కించుకున్న విషయం తెలిసిందే. అవేశ్ ఖాన్ మీద లక్నో జట్టు ఏకంగా రూ. 10 కోట్లు ఖర్చు పెట్టింది. జేసన్ హోల్డర్ మీద రూ. 8.75 కోట్లు వెచ్చించింది.
ఐపీఎల్ రిటెన్షన్ తో పాటు వేలంలో లక్నో దక్కించుకున్న ఆటగాళ్ల జాబితా :
కెఎల్ రాహుల్, మార్కస్ స్టొయినిస్, రవి బిష్ణోయ్ (ఈ ముగ్గురు రిటెన్షన్ ద్వారా), క్వింటన్ డికాక్, మనీష్ పాండే, జేసన్ హోల్డర్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మార్క్ వుడ్, అవేశ్ ఖాన్, అంకిత్ సింగ్ రాజ్పుత్, కె.గౌతమ్, దుష్మంత చమీర, శాబాజ్ నదీమ్, మనన్ వోహ్రా, మోహ్సిన్ ఖాన్, అయుష్ బదోని, కైల్ మేయర్స్, కరణ్ శర్మ, ఎవిన్ లూయిస్, మయాంక్ యాదవ్
