Avishka Fernando: ఇప్పటివరకు 74 టీ20 లు ఆడిన ఫెర్నాండో.. 1600కు పైగా పరుగులు చేశాడు. ఇందులో డజను అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి. సిక్సర్లను మంచి నీళ్లు తాగినంత సులువుగా బాదేయడం ఫెర్నాండో స్పెషాలిటీ.
మరికొద్దిరోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్-15 కు సంబంధించిన మెగా వేలం జరుగనున్నది. ఇప్పటికే ముగిసిన ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియలో 8 ఫ్రాంచైజీలు.. ఆయా జట్లు రిటైన్ చేసుకునే ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. వేలంలో ఎవరిని తీసుకోవాలి..? వాళ్లకు ఎంత ఖర్చు చేయాలి..? అని లెక్కలేసుకుంటున్నాయి. ఇక ఒక్క ఇన్నింగ్స్ తో వాళ్లందరినీ తన వైపునకు తిప్పుకున్నాడు శ్రీలంక క్రికెటర్ అవిష్క ఫెర్నాండో. అంత గొప్ప ఇన్నింగ్స్ అతడు ఏమాడాడు..? అనుకుంటున్నారా...? అతడేం శ్రీలంకను ఒంటి చేత్తో గెలిపించే ఇన్నింగ్సులు ఆడలేదు. కానీ..
భారత్ లో ఐపీఎల్ మాదిరే శ్రీలంకలో కూడా ఆ దేశపు క్రికెట్ బోర్డు లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్)అని స్టార్ట్ చేసింది. ఇది రెండో సీజన్. ఈ సీజన్ లో భాగంగా జాఫ్నా కింగ్స్ తరఫున ఆడుతున్న 23 ఏండ్ల అవిష్క ఫెర్నాండో.. సిక్సర్ల వీరుడిగా గుర్తింపు పొందాడు. ఆ పేరును సార్థకం చేసుకుంటూ.. నిన్న్ కాండీ వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో వీరబాదుడు బాదాడు. 23 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సిక్సర్లున్నాయి మరి.. అంటే సిక్సర్ల ద్వారా వచ్చిన పరుగులే 42.
ఐపీఎల్ లో ఇప్పటికే లంకకు చెందిన హసరంగ, దుష్మంత చమీరాలు భాగమయ్యారు. ఇక వచ్చే ఐపీఎల్ వేలంలోకి వస్తే ఫెర్నాండో కూడా హాట్ కేక్ గా మారడం ఖాయమని క్రికెట్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలు ఫ్రాంచైజీలు కూడా ఈ వీర విధ్వంసక ఆటగాడి మీద ఓ కన్నేసి ఉంచాయి.
ఇప్పటివరకు 74 టీ20 లు ఆడిన ఫెర్నాండో.. 1600కు పైగా పరుగులు చేశాడు. ఇందులో డజను అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి.అంతేగాక ఎల్పీఎల్ లో ఒకే ఇన్నింగ్సులో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా కూడా ఫెర్నాండో రెండు సార్లు రికార్డు నమోదు చేశాడు.
ఈ జాబితాలో పావెల్.. ఈ సీజన్ లోనే కాండీ వారియర్స్ పై ఈ రికార్డు నమోదు చేయగా.. ఫెర్నాండో ఈ సీజన్ తో పాటు గత సీజన్ లో కూడా ఒకే ఇన్నింగ్సులో ఏడు సిక్సర్లు కొట్టిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. అంతకుముందు.. ఎల్పీఎల్ లో అత్యంత దూరం (100 మీటర్లు) సిక్సర్ కొట్టిన రికార్డు కూడా ఫెర్నాండో పేరిటే ఉంది.
ఇక వచ్చే జనవరి రెండో వారంలో ఐపీఎల్ వేలం నిర్వహించే అవకాశముంది. ఈ మేరకు ఇప్పటికే ఆయా జట్లు తాము దక్కించుకోబోయే ఆటగాళ్ల గత రికార్డులు, ప్రస్తుత ఫామ్ ను బేరీజు వేసుకుంటున్నాయి. ఈసారి డేవిడ్ వార్నర్, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, శిఖర్ ధావన్ వంటి స్టార్ ఆటగాళ్లు కూడా వేలంలో ఉండనున్నారు. రెండు కొత్త ఫ్రాంచైజీలు కూడా వస్తుండటంతో ఈసారి ఆటగాళ్ల పంట పండటం ఖాయంగా కనిపిస్తున్నది.
