లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 టోర్నీలో ఇండియా మహారాజాస్‌కి తొలి విజయం.. ఆసియా లయన్స్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్న గంభీర్ టీమ్..
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 టోర్నీలో ఇండియా మహారాజాస్‌కి తొలి విజయం దక్కింది. వరుసగా రెండు మ్యాచుల్లో పోరాడి ఓడిన ఇండియా మహారాజాస్, ఆసియా లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో అదిరిపోయే విజయంతో బోణీ కొట్టింది. టాస్ గెలిచిన ఇండియా మహారాజాస్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసియా లయన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగుల స్కోరు చేసింది..
తిలకరత్నే దిల్షాన్ 27 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేసి స్టువర్ట్ బిన్నీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. మహ్మద్ షమీజ్ 6 బంతుల్లో 2 పరుగులు చేసి హర్భజన్ సింగ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ కాగా కెప్టెన్ మిస్బా వుల్ హక్, ప్రవీణ్ తాంబే బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు...
అస్గర్ ఆఫ్ఘాన్ 18 బంతుల్లో ఓ సిక్సర్‌తో 15 పరుగులు చేయగా వికెట్ కీపర్ ఉపుల్ తరంగ 48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 69 పరుగులు చేసి సురేష్ రైనా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అబ్దుల్ రజాన్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 పరుగులు చేయగా త్రిసారా పెరేరా 3 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...
భారత బౌలర్లలో సురేష్ రైనాకి 2 వికెట్లు దక్కగా స్టువర్ట్ బిన్నీ, హర్భజన్ సింగ్, ప్రవీణ్ తాంబేలకు తలా ఓ వికెట్ దక్కింది. 158 పరుగుల టార్గెట్‌ని వికెట్ కోల్పోకుండా ఛేదించింది ఇండియా మహారాజాస్. రాబిన్ ఊతప్ప 39 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 88 పరుగులు చేయగా కెప్టెన్ గౌతమ్ గంభీర్ 36 బంతుల్లో 12 ఫోర్లతో 61 పరుగులు చేశాడు...
గత మ్యాచ్‌లో ఆసియా లయన్స్ టీమ్‌కి షాహిద్ ఆఫ్రిదీ కెప్టెన్సీ చేయగా, రెండో మ్యాచ్‌లో అతనికి రెస్ట్ ఇచ్చారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీలో భాగంగా నేడు ఇండియా మహారాజాస్ జట్టు, వరల్డ్ జెయింట్స్‌తో రెండోసారి తలబడనుంది. రేపు వరల్డ్ జెయింట్స్, ఆసియా లయన్స్ మధ్య చివరి గ్రూప్ మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత నాకౌట్ మ్యాచులు జరుగుతాయి.
పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న టీమ్ నేరుగా ఫైనల్‌కి చేరుకుంటుంది. రెండో స్థానంలో ఉన్న జట్టు, మూడో స్థానంలో ఉన్న టీమ్‌లో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు, టాప్ ప్లేస్‌లో ఉన్న టీమ్‌తో మార్చి 20న ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది..
2022 సీజన్‌లో అజాదీ కా అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఇండియా క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, మణిపాల్ టైగర్స్, బిల్వారా కింగ్స్ టీమ్స్ పేరుతో లెజెండ్స్ లీగ్ క్రికెట్‌ని నిర్వహించారు. అయితే దీనికి పెద్దగా ఆదరణ దక్కకపోవడంతో తిరిగి పాత పద్ధతిలోనే ఆసియా లయన్స్, వరల్డ్ జెయింట్స్, ఇండియా మహారాజాస్ జట్లతో లెజెండ్స్ లీగ్ క్రికెట్ సీజన్ 3 జరుగుతోంది..
