ఒక పక్క క్రికెటర్లంతా ముఖ్యంగా బౌలర్లంతా పని భారం ఎక్కువవడం వల్ల ఒత్తిడికి లొనువుతున్నామని మొత్తుకుంటుంటే... టీం ఇండియా పేసర్ ఉమేష్ యాదవ్ మాత్రం పని లేక ఖాళీగా ఉంటున్నానని బాధపడిపోతున్నాడు. 

టీం ఇండియా తరుఫున క్రికెట్ ఎక్కువ ఆడడానికి తనకు అవకాశం దక్కడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నాడు. టీం ఇండియా తరుఫున అవకాశం ఎక్కువగా లభించకపోతుండడంతో, తాను కౌంటీ క్రికెట్ వైపు మొగ్గు చూపెడుతున్నట్టు తెలిపాడు. 

తాను ఇలా క్రికెట్ ఆడకుండా ఖాళీగా కూర్చోవడం తనకు నాచడంలేదని... మరిన్ని మ్యాచులు ఆడాలంటే ఏం చేయాలో సెలెక్టర్లనే నేరుగా అడిగేస్తే ఒక పనయిపోతుందని ఉమేష్ యాదవ్ అభిప్రాయపడ్డాడు. 

ఎక్కువ మ్యాచులాడితే పనిభారాన్ని పర్యవేక్షిస్తూ ఉండాల్సిన అవసరం ఉంటుందని, కాకపోతే తన విషయంలో అది పూర్తిగా వ్యతిరేకంగా ఉందని ఉమేష్ యాదవ్ అన్నాడు. గత రెండు సంవత్సరాల్లో తాను చాలా తక్కువ టెస్టు మ్యాచులాడానని అన్నాడు. 

Also read: జిమ్ లో ఉమేశ్ యాదవ్ కసరత్తులు... ఘోరంగా ట్రోల్ చేసిన జడేజా

తన ప్రస్తుత వయసు 31 సంవత్సరాలని, వచ్చే నాలుగైదు యేండ్లు తన కెరీర్ కు చాలా ముఖ్యమైనవని, ఎంత ఎక్కువ బౌలింగ్ చేస్తే అంత మెరుగయ్యే ఆస్కారముందని అన్నాడు. గత రెండు సంవత్సరాల్లో గనుక తీసుకుంటే... 2018లో కేవలం 4 మ్యాచులే ఆడానని, 2019లో కూడా 4 టెస్టు మ్యాచులే ఆడానని అన్నాడు. ఇక వైట్ బాల్ క్రికెట్ అయితే ఒకే ఒక్క మ్యాచులో ఆడానని తెలిపాడు. 

ఈ వయసులో తానెంత ఎక్కువ వీలయితే అంత బౌలింగ్ చేయాల్సి ఉంటుందని, అప్పుడే పరిణితి సాధించే అవకాశం ఉందని అన్నాడు. అంతర్జాతీయ మంచులాడే అవకాశం రావడంలేదు కాబట్టి డొమెస్టిక్ మ్యాచులు ఎక్కువగా ఆడుతున్నానని అన్నాడు. 

న్యూజిలాండ్ పర్యటన తరువాత టి 20 ప్రపంచ కప్ ఉంది. ఒక వేళా గనుక ఇప్పుడు వైట్ బాల్ క్రికెట్ కి ఎంపికవకపోతే... ఇక తనకు మిగిలింది కేవలం ఐపీఎల్ మాత్రమేనని అన్నాడు ఉమేష్ యాదవ్. 

గత సంవత్సరం కౌంటీ ప్రతిపాదన వచ్చినప్పటికీ, బీసీసీఐ పనిభారం నియమాల ప్రకారం కేవలం రెండు నుంచి మూడు మ్యాచులు మాత్రమే ఆడడానికి అవకాశం ఇచ్చింది. వారేమో 7 మ్యాచులు ఆడమని అడిగారు. దానితో ఆ కాంట్రాక్టు కాస్తా కూడా రద్దయింది. 

ఈ సారి మాత్రం కౌంటీలు ఎక్కువగా ఆడేందుకు ప్రయత్నిస్తానని, గత సంవత్సరంలా కాకుండా చూసుకుంటానని అన్నాడు. గాయాల బారిన పడకుండా కూడా జాగ్రత్తపడుతున్నట్టు తెలిపాడు. ప్రస్తుతం రాబోయే ఐపీఎల్ ను దృష్టిలో ఉంచుకొనే ప్రాక్టీస్ చేస్తున్నానని అన్నాడు.