Srilanka: శ్రీలంక క్రికెట్ దిగ్గజం మహేళ జయవర్దనే కు కీలక పదవి దక్కింది. బిజీ షెడ్యూల్ ముందున్న నేపథ్యంలో అతడిని కీ రోల్ లో నియమిస్తున్నట్టు శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది.
శ్రీలంక క్రికెట్ దిగ్గజం, ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు కోచ్ గా పనిచేస్తున్న మహేళ జయవర్దనే కు కీలక పదవి దక్కింది. ఇన్నాళ్లుగా ఆ దేశ అండర్-19 జట్టుకు హెడ్ కోచ్ గా ఉన్న అతడిని శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్సీబీ) ప్రమోట్ చేసింది. తాజాగా అతడిని జాతీయ జట్టుకు కన్సల్టెంట్ కోచ్ గా నియమించింది. ఈ మేరకు ఎస్సీబీ ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది. శ్రీలంక క్రికెట్ సీఈవో గా ఉన్న అశ్లే డి సిల్వా ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు.
‘2022 లో శ్రీలంక తీరిక లేని క్రికెట్ ఆడనుంది. దాంతో పాటు కీలక షెడ్యూల్స్ కూడా ముందున్నాయి. ఈ నేపథ్యంలో విస్తృతమైన పాత్ర కోసం మహేళ జాతీయ జట్టుతో చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది..’ అని ఆయన తెలిపారు. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ లో ఆయన లీగ్ స్టేజ్ లో ఆయన ఆ దేశ క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్ గా పని చేశాడు. ఆ ఈవెంట్ లో మహేళ పాత్ర ఎంతో కీలకమైనదని డి సిల్వా జోడించారు.
వచ్చే ఏడాది జనవరి 1 నుంచి మహేళ జయవర్ధనే.. కొత్త పదవిలో చేరనున్నాడు. ఈ పదవిలో ఆయన ఏడాది పాటు సేవలందించనున్నాడు. దీంతో పాటు మహేళ ప్రస్తుతం శ్రీలంక అండర్-19 జట్టుకు కూడా కోచ్ గా సేవలందిస్తున్నాడు. వచ్చే ఏడాది వెస్టిండీస్ వేదికగా అండర్-19 వన్డే ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో ఆయన ప్రస్తుతం ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నారు.
ఇక తన నియామకంపై మహేళ మాట్లాడుతూ.. ‘ఇది గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. జాతీయ జట్టులోని ఆటగాళ్లు, కోచ్ లతో కలిసి పనిచేయడం.. శ్రీలంకలోని అపారమైన క్రికెట్ ప్రతిభ, సామర్థ్యమున్న ఆటగాళ్లను వెలికితీసి వారికి న్యాయం చేయడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది.. నేను శ్రీలంక జట్టుపై చాలా మక్కువ కలిగి ఉన్నాను. అందరి సమన్వయంతో పని చేసి భవిష్యత్తులో మంచి విజయాలు సాధించడానికి కృషి చేస్తాం..’ అని చెప్పాడు.
శ్రీలంక కంటే ముందే మహేళ.. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు హెడ్ కోచ్ గా ఉన్నాడు. 2019, 2020 లలో ఆ జట్టు టైటిల్ నెగ్గడంతో జయవర్ధనే కు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం శ్రీలంక జాతీయ జట్టుకు మిక్కీ ఆర్థర్ హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. అతడితో పాటు ఇతర శిక్షణా సిబ్బందికి సలహాలివ్వడం మహేళ ముందున్న పని..
