చైనాలో జరిగే ఆసియా క్రీడలు 2023 పోటీలకు ఎంపికైన పంజాబ్ కింగ్స్ వికెట్ కీపర్ జితేశ్ శర్మ.. నీరజ్ చోప్రాను కలిసేందుకు ఆశగా ఎదురుచూస్తున్నానంటూ కామెంట్.. 

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆకట్టుకున్న యంగ్ ప్లేయర్లలో పంజాబ్ కింగ్స్ వికెట్ కీపర్ జితేశ్ శర్మ ఒకడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో 12 మ్యాచుల్లో 234 పరుగులు చేసిన జితేశ్, 2023 ఐపీఎల్ సీజన్‌లో 14 మ్యాచులు ఆడి 156.06 స్ట్రైయిక్ రేటుతో 309 పరుగులు చేశాడు. ఈ పర్ఫామెన్స్‌తో చైనాలో జరిగే ఆసియా క్రీడలు 2023 పోటీలకు ఎంపిక చేసిన భారత మెన్స్ క్రికెట్ టీమ్‌కి ఎంపికయ్యాడు జితేశ్ శర్మ..

29 ఏళ్ల జితేశ్ శర్మకి ఇదే మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. ‘ఆసియా క్రీడలకు ఎంపికయ్యానని తెలియగానే మిల్కా సింగ్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలిగింది. భారత బృందంతో కలిసి నడిచేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా. భారత దేశ టాప్ అథ్లెట్లతో కలిసి ప్రపంచ వేదికపై నడిచే అదృష్టం కలగడం ఎంతో గర్వ కారణం..

అతని మెంటాలిటీ ఎలా ఉంటుందో...

నీరజ్ చోప్రాని కలవాలని ఆశగా ఎదురుచూస్తున్నా. అతను ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలిచాడు. ఆ తర్వాత ఎన్నో పోటీల్లో మెడల్స్ సాధించాడు. నీరజ్ చోప్రా రికార్డుని ఎవ్వరూ బీట్ చేస్తారని అనుకోవడం లేదు... నీరజ్ చోప్రా మెంటాలిటీ గురించి తెలుసుకోవాలని ఉంది. జట్టుగా ఆడి గెలవడం వేరు, ఇలా ఒంటరిగా ఆడే స్పోర్ట్స్ వేరు. అక్కడ మనమే సైన్యం. 10 మందితో కలిసి ఆడినప్పుడు సపోర్ట్ దక్కుతుంది. కానీ అథ్లెటిక్స్‌లో ఒక్కరే పోరాడాలి..

వారితో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేయడం, జిమ్ చేయడం చాలా గొప్ప అనుభవాన్ని మిగులుస్తుందని ఆశిస్తున్నా. ఇది నా జీవితాన్ని మార్చేస్తుందని ఆశిస్తున్నా..

కోచ్ లేడు, యూట్యూబ్ వీడియోలతోనే...

నాకు చిన్నతనం నుంచి సరైన కోచ్ లేడు. ఆడమ్ గిల్‌క్రిస్ట్, సౌరవ్ గంగూలీ వీడియోలు చూస్తూ బ్యాటింగ్ చేస్తున్నా. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ వీడియోలు చూస్తూ అలా ఆడేందుకు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుంటా..

సూర్యకుమార్ యాదవ్ దగ్గరున్న స్కిల్స్ నా దగ్గర లేవు. అయితే అతను ఎలా రిస్క్ ఫ్రీ షాట్స్ ఆడతాడో అలాగే ఆడేందుకు ప్రయత్నిస్తుంటా. వికెట్ కీపింగ్ చేసేటప్పుడు చాలా సైలెంట్‌గా ఉండడానికి ప్రయత్నిస్తా..

అయితే వికెట్ కీపర్‌ అన్నప్పుడు ఫీడ్ బ్యాక్ ఇవ్వడం చాలా అవసరం. ముఖ్యంగా స్పిన్ బౌలర్లకు వికెట్ కీపర్ అవసరం చాలా ఉంటుంది. అందుకే అవసరమైన సలహాలు ఇస్తుంటా. ఐపీఎల్ తర్వాతే నా గురించి చాలా మందికి తెలిసింది. ఇప్పుడు ఎన్నో మెసేజ్‌లు, ఫోన్లు వస్తుంటాయి...

నేను ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ కావాలని అనుకున్నా. ఫిట్‌నెస్‌పై చాలా శ్రద్ధ పెడతా. క్రికెట్‌లో ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. అందుకే ఫిట్‌నెస్‌పై మరింత ప్రేమ పెరిగింది..’ అంటూ చెప్పుకొచ్చాడు వికెట్ కీపర్ జితేశ్ శర్మ.. 

సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమయ్యే 19వ ఆసియా క్రీడలు, అక్టోబర్ 8న ముగుస్తాయి. భారత పురుషుల క్రికెట్ టీమ్‌కి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంటే, హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో భారత మహిళా క్రికెట్ టీమ్ బరిలో దిగుతోంది.