చెన్నై సూపర్ కింగ్స్.. ఈ ఐపీఎల్ 2021 సీజన్ లో తొలి బోణి కొట్టింది. శుక్రవారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో.. చెన్నై విజయం సాధించింది. కాగా.. ఈ మ్యాచ్ లో ఓడిపోవడం పై పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తీవ్ర అసహనానికి గురయ్యాడు.

ఈ ఘోర ఓటమి గురించి మాట్లాడటానికి ఏం ఉంటుందని ప్రశ్నించాడు. మ్యాచ్‌ తర్వాత అవార్డుల కార్యక్రమంలో రాహుల్‌.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రధానంగా బ్యాటింగ్‌ లైనప్‌ చెల్లాచెదురు కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు.  అసలు ఎక్కువగా చెప్పడానికి ఏమీ లేదన్నాడు. 

‘‘ఈ పిచ్‌ను సద్వినియోగం చేసుకున్న సీఎస్‌కే బౌలర్లకే మొత్తం క్రెడిట్‌ ఇవ్వాలి. వారు సరైన ఏరియాల్లో బౌలింగ్‌ చేసి ఫలితాన్ని రాబట్టారు. దీపక్‌ చాహర్‌ వేసిన నకుల్‌ బాల్స్‌తో వికెట్లను సాధించాడు. నా రనౌట్‌తో కూడా మా జట్టుకి నష్టమే జరిగింది. మేము మ్యాచ్‌ ఆరంభించేటప్పటికి పిచ్‌ అంతా బాగుంది. ఇది అంత చెత్త పిచ్‌ కాదు. 100-110 స్కోర్లు చేసే పిచ్‌ కాదు. ఈ పిచ్‌పై 150-160 స్కోర్లు ఈజీగా వస్తాయి. ఇది మాకు గుణపాఠం. ఈ మ్యాచ్‌లో చేసిన తప్పిదాల నుంచైనా తేరుకుని ముందుకు సాగుతాం. తదుపరి గేమ్‌ నాటికి మంచి పేస్‌ విభాగంతో మ్యాచ్‌ సిద్ధమవుతాం’’ అని రాహుల్‌ తెలిపాడు.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి చెన్నై ఫీల్డింగ్ ఎంచుకోగా.. తొలుత బ్యాటింగ్ పంజాబ్ చేసింది. అయితే.. నిర్దేశిత ఓవర్లలో పంజాబ్ కింగ్స్ చాలా తక్కువ స్కోర్ చేసింది. కేవలం 106 పరుగులు చేసి తమ ఆటను ముగించింది. ఆ స్కోర్ చేధించడం చెన్నైకి చాలా సునాయాసమైంది. చివరకు విజయం చెన్నైకే దక్కింది.