ఐపీఎల్-2019లో ముంబై ఇండియన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన బౌలర్ లసిత్ మలింగ మొదటి ఆరు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. రానున్న ప్రపంచకప్ కోసం ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్‌లో ప్రతిభ నిరూపించుకోవాలని లంక క్రికెట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది.

ఈ టోర్నీలో మలింగ పాల్గొనాల్సి ఉన్నందున ఏప్రిల్ 4 నుంచి 11 వరకు జట్టుకు దూరం కానున్నాడు. అయితే ఐపీఎల్‌లో ఆడేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా మలింగ బోర్డును కోరాడు..

ఐపీఎల్‌లో నిరభ్యంతరంగా ఆడవచ్చని అయితే వరల్డ్‌కప్‌లో ఆడాలనుకుంటే మాత్రం టోర్నీ ఆడాల్సిందేనని లంక బోర్డు తేల్చి చెప్పినట్లు అతడు పేర్కొన్నాడు. మలింగతో పాటు న్యూజిలాండ్ పేసర్ ఆడం మిల్నే కూడా గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరం కావడంతో ముంబై పేస్‌లో బలం తగ్గినట్లయ్యింది.

మరోవైపు మలింగ స్థానంలో విండీస్ బౌలర్ అలార్జీ జోసెఫ్‌ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. లసిత్ మలింగను ముంబై యాజమాన్యం వేలంలో రూ.2 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది.