పల్లెకెలె: న్యూజిలాండ్ తో జరిగిన మూడో ట్వంటీ20 మ్యాచులో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. న్యూజిలాండ్ కు చుక్కలు చూపించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లను రెండు సార్లు పడగొట్టిన ఏకైక బౌలర్ గా మలింగ రికార్డు సృష్టించాడు. 

36 ఏళ్ల మలింగ న్యూజిలాండ్ ఆటగాళ్లు కొలిన్ మన్రో ((12), హమీష్ రూథర్ ఫర్డ్ (0), కోలిన్ డి గ్రాండ్ హోమ్ (0), రాస్ టేలర్ (0)లను  వరుస బంతుల్లో అవుట్ చేశాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ లో ఐదుసార్లు హ్యాట్రిక్ సాధించిన బౌలరుగా కూడా మలింగ రికార్డు సృష్టించాడు. తద్వారా పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ షాహిద్ ఆఫ్రిది (97) రికార్డును బద్దలు కొట్టాడు. 

ఆరు పరుగులకే ఐదు వికెట్లు తీసి తన కెరీర్ లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. టీ20లో నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన రెండో బౌలర్ గా మలింగ అవతరించాడు. అంతకు ముందు రషీద్ ఖాన్ ఆ ఘనత సాధించాడు. ఆండ్రే రసెల్, ఆల్ అమిన్ హొస్సేన్ టీ20ల్లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశారు. టీ20 అంతర్జాతీయ మ్యాచుల్లో వంద వికెట్లు తీసిన బౌలరుగా కూడా మలింగ రికార్డు సృష్టించాడు. 

న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ మలింగ దెబ్బకు కకావికలమైంది. దాంతో న్యూజిలాండ్ 16 ఓవర్లలో 88 పరుగులు చేసి 37 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.