All England Open Badminton: రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ  బర్మింగ్ హోమ్ వేదికగా జరుగుతన్న ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ఛాంపియన్షిప్ లో  భారత యువ షట్లర్ లక్ష్య సేన్ సంచలన విజయంతో ఫైనల్ కు చేరాడు. 

బ్యాడ్మింటన్ లో భారత్ కు రెండు దశాబ్దాలుగా అందని ద్రాక్షలా ఊరిస్తున్న ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు యువ కెరటం లక్ష్య సేన్ దూసుకెళ్లాడు. మాజీ బ్యాడ్మింటన్ ఆటగాడు పుల్లెల గోపిచంద్ తర్వాత ఈ టోర్నీ ఫైనల్ కు వెళ్లిన ఆటగాడు (పురుషుల విభాగంలో) లక్ష్య సేనే కావడం గమనార్హం. సెమీస్ లో లక్ష్య సేన్.. డిపెండింగ్ ఛాంపియన్, మలేషియాకు చెందిన లీ జి జియాను ఓడించాడు. బర్మింగ్ హోమ్ వేదికగా జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21-13, 12-21, 21-19 తో ఆరో సీడ్ లీ జి జియాను ఓడించాడు. 

శనివారం హోరాహోరిగా సాగిన పురుషుల సింగిల్స్ లో లక్ష్య.. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగాడు. తొలి సెట్ లోనే ప్రత్యర్థికి షాకిచ్చాడు. ఈ సెట్ ను చూస్తే లక్ష్య సునాయసంగానే ఫైనల్ చేరతాడని అనిపించింది. అయితే రెండో సెట్ లో లీ జి పుంజుకున్నాడు. ఆ సెట్ లో లక్ష్యకు పోటీనివ్వడమే కాకుండా సెట్ ను కూడా గెలుచుకున్నాడు. 

అయితే విరామం తర్వాత లక్ష్య జోరు ముందు లీ జి నిలువలేదు. మూడో సెట్ లో పోరు హోరాహోరిగా మారింది. ఇరువురు కలిసి నువ్వా నేనా అన్నట్టుగా పోరాడారు. ఒకదశలో లీ జి 16-12 తో లీడ్ లోకి వచ్చి గేమ్ ను చేజిక్కించుకునేలా కనిపించాడు. 

Scroll to load tweet…

కానీ అద్భుత ఆటతీరుతో లక్ష్య పుంజుకున్నాడు. 16-18తో వెనుకబడ్డా తర్వాత వరుసగా నాలుగు పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ క్రమంలో లి పోరాటాన్ని సాగించినా ఫలితం మాత్రం లక్ష్యదే.. మరో సెమీస్ లో టాప్ సీడ్ అక్సెల్సెన్ (డెన్మార్క్), టియాస్ చెన్ (చైనీస్ తైఫీ) మధ్య జరిగిన రెండో సెమీస్ లో విజేతతో లక్ష్య ఫైనల్ ఆడతాడు. 

21 ఏండ్ల నిరీక్షణకు తెర : 

బ్యాడ్మింటన్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ఛాంపియన్షిప్ ను నెగ్గాలని ప్రతి ఆటగాడికి కల. అయితే భారత్ తరఫున ఆ కలను నిజం చేసుకున్న వాళ్లను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఈ టోర్నీలో భారత్ నుంచి టైటిల్ సాధించింది ఇద్దరే. 1947లో ప్రకాశ్ నాథ్ రన్నరప్ గా నిలిచాడు. ఆ తర్వాత 1980లో ప్రకాశ్ పదుకునే (బాలీవుడ్ నటి దీపికా పదుకునే తండ్రి), 2001లో పుల్లెల గోపిచంద్ ఈ టోర్నీ నెగ్గాడు. గోపిచంద్ తర్వాత మళ్లీ ఈ టోర్నీ ఫైనల్ కు వెళ్లిన భారతీయుడు లేడు. పురుషుల సింగిల్స్ లో భారత్ నుంచి ఈ టోర్నీ ఫైనల్ కు చేరిన నాలుగో ఆటగాడిగా లక్ష్యసేన్ రికార్డులకెక్కాడు. మహిళల సింగిల్స్ లో సైనా నెహ్వాల్ 2015లో ఆల్ ఇంగ్లాండ్ ఫైనల్ లో ఆడినా రన్నరప్ గా నిలిచింది. 

బెంగళూరులోని ప్రకాశ్ పదుకునే బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతున్న లక్ష్య సేన్.. కొంతకాలంగా అనూహ్య ఫలితాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో తనకంటే మెరుగైన ఆటగాళ్లకు షాకిస్తూ.. నిలకడగా రాణిస్తున్నాడు. గతేడాది డిసెంబర్ లో ప్రపంచ ఛాంపియన్షిప్ లో కాంస్య పతకం గెలిచిన లక్ష్య సేన్.. ఈ ఏడాది జనవరిలో ఇండియా ఓపెన్ టైటిల్ నెగ్గిన విషయం తెలిసిందే. గత వారం జర్మన్ ఓపెన్ లో రన్నరప్ గా నిలిచాడు. మరి నేటి ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ఛాంపియన్షిప్ లో విజేతగా నిలుస్తాడో లేదా చూడాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.