భారతదేశంలో కరోనా వైరస్ బారినపడుతున్న ప్రముఖల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. ప్రతిరోజూ ఎవరో ఒకరు ఈ మహమ్మారి బారినపడుతున్నారు. తాజాగా టీమిండియా త్రిశతక వీరుడు కరుణ్ నాయర్ కోవిడ్ బారినపడి దాని నుంచి కోలుకున్నాడు.

ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 8న చేయించుకున్న పరీక్షలో తనకు నెగిటివ్ వచ్చిందని కరుణ్ చెప్పాడు. నెగిటివ్ రావడానికి ముందు రెండు వారాలు కరుణ్ హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నాడు.

అయితే యూఏఈలో జరగనున్న ఐపీఎల్‌లో పాల్గొనాలంటే నిబంధనల ప్రకారం 24 గంటల్లో రెండు ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాల్సి వుంది. వాటిలో నెగిటివ్ వస్తేనే ఆగస్టు 20 తర్వాత దుబాయ్ వెళ్లేందుకు అనుమతి లభిస్తుంది.

ప్రస్తుతం కరుణ్ బెంగళూరులోని శిబిరంలో ఉన్నాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ తరపున కరుణ్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గతంలో ఢిల్లీ తరపున ఆడిన అతను 2018, 2019 నుంచి పంజాబ్‌ తరపున బరిలో నిలిచాడు.

14 మ్యాచ్‌ల్లో 134.80 సగటుతో 306 పరుగులు చేశాడు. అయితే భారత్ తరపున కోవిడ్ 19 బారినపడ్డ జాతీయ జట్టు ఆటగాడు కరుణ్ మాత్రమే. ఐపీఎల్‌కు సంబంధించ రెండో వ్యక్తి. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ కోచ్ దిశాంత్ యాగ్నిక్‌కు బుధవారం పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.