IPL 2022-KKR: ఐపీఎల్ లో రెండు సార్లు ఛాంపియన్, గతేడాది రన్నరప్ కోల్కతా నైట్ రైడర్స్ ఈ ఏడాది సీజన్ ను ఘనంగా ఆరంభించింది. ఆరంభంలో మెరుగైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నా తర్వాత గాడి తప్పింది. తాజాగా లక్నోతో ఓటమితో ఆ జట్టు ప్లేఆఫ్స్ నుంచి దాదాపు నిష్క్రమించినట్టే..
ఐపీఎల్-2022 లో కొత్త కెప్టెన్, కొత్త ఆటగాళ్లతో బరిలోకి దిగినా కోల్కతా నైట్ రైడర్స్ రాత మారలేదు. గతేడాది తొలి దశలో విఫలమైనా దుబాయ్ లో ముగిసిన రెండో దశలో అనూహ్యంగా పుంజుకుని ఫైనల్ చేరిన ఆ జట్టు.. ఈ సీజన్ లో మాత్రం దారుణంగా విఫలమైంది. కొత్త సీజన్ లో తొలి మ్యాచ్ ను ఘనంగా విజయంతో బోణీ చేసిన కేకేఆర్.. తర్వాత బోల్తా కొట్టింది. వరుస పరాజయాలతో ఇప్పుడు దాదాపు ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యం, వెస్టిండీస్ ఆల్ రౌండర్లు ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్ వైఫల్యాలు.. ఇలా ఏదీ కూడా ఆ జట్టుకు కలిసి రాలేదు.
ఈ సీజన్ లో ఆడిన తొలి మ్యాచ్ లోనే డిఫెండింగ్ ఛాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించిన కేకేఆర్.. ఆ తర్వాత మ్యాచ్ లో ఓడినా మళ్లీ పంజాబ్ తో ఆడిన మూడో మ్యాచ్ లో గెలిచి గాడిన పడింది. ముంబై ని కూడా మట్టి కరిపించిందది.కానీ ఆ తర్వాత ఆ జట్టుకు పరాజయాలు వెంటాడాయి.
ఐపీఎల్-15లో కేకేఆర్ ప్రదర్శన
- చెన్నైతో 6 వికెట్ల తేడాతో విజయం
- ఆర్సీబీతో 3 వికెట్ల తేడాతో ఓటమి
- పంజాబ్ తో మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో గెలుపు
- ముంబైతో 5 వికెట్ల తేడాతో విజయం
- ఢిల్లీ తో 44 పరుగుల తేడాతో ఓటమి
- హైదరాబాద్ తో ఏడు వికెట్ల తేడాతో ఓటమి
- రాజస్తాన్ తో ఏడు పరుగుల తో ఓటమి
- గుజరాత్ తో 8 పరుగులతో పరాజయం
- ఢిల్లీ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓటమమి
- రాజస్తాన్ పై 7 వికెట్ల తేడాతో గెలుపు
- లక్నో చేతిలో 75 పరుగుల తేడాతో ఓటమి
మిగిలున్న మ్యాచులు : ఇప్పటివరకు 11 మ్యాచులాడిన కేకేఆర్.. నాలుగింట్లో నెగ్గి ఏడింట్లో ఓడింది. ఆ జట్టు తన తదుపరి మూడు మ్యాచులను ముంబై, హైదరాబాద్, లక్నోతో ఆడనుంది.
వైఫల్యానికి కారణాలు..
సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో జట్టు అంతర్గత వైఫల్యాలు బయటకు కనబడలేదు. కానీ ఆ తర్వాత వరుస ఓటములతో అవి తప్ప ఏమీ కనబడలేదు. ముఖ్యంగా బ్యాటింగ్ లో ఓపెనింగ్ జోడీ ఈ సీజన్ లో అట్టర్ ఫ్లాఫ్ అయింది. గత సీజన్ వరకు శుభమన్ గిల్.. కేకేఆర్ కు మంచి ఆరంభాలిచ్చేవాడు. కానీ ఈ సీజన్ లో కేకేఆర్ అతడిని రిటైన్ చేసుకోలేదు. ఒక్క సీజన్ లో మెరిశాడని వెంకటేశ్ అయ్యర్ కు రూ. 8 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది. ఐపీఎల్-15లో 9 మ్యాచులాడిన వెంకటేశ్ చేసింది 132 పరుగులు. ఓపెనర్ గా విఫలమైన అతడిని హిట్టర్ గా దించాలని చేసిన ప్రయోగం కూడా సఫలం కాలేదు.
ఇక అయ్యర్ తో పాటు మొదట్లో పలు మ్యాచులకు అజింక్యా రహానే ను ఆడించారు. కానీ అతడు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. తర్వాత ఆరోన్ ఫించ్ (5 మ్యాచుల్లో 86) వచ్చాడు. అతడిదీ అదే పరిస్థితి. వన్ డౌన్ లో వచ్చే శ్రేయస్ అయ్యర్ (11 మ్యాచులు 330) , అతడి తర్వాత వచ్చే నితీశ్ రాణా (11 మ్యచులు 250)లు తప్ప మిగిలినవాళ్లంతా నిలకడగా రాణించింది లేదు. రసెల్ (11 మ్యాచులు.. 272 రన్స్.. 12 వికెట్లు) అడపాదడపా రాణించాడే తప్ప అతడు కూడా ప్రతి మ్యాచ్ లో ఆదుకున్నదీ లేదు.
బౌలింగ్ బిగ్ మైనస్..
ఈ ఏడాది కేకేఆర్ కు బౌలింగ్ తరఫున ప్యాట్ కమిన్స్, టిమ్ సౌథీ, ఉమేశ్ యాదవ్, సునీల్ నరైన్ (11 మ్యాచులు.. 49 పరుగులు.. 8 వికెట్లు) వంటి ప్రపంచ స్థాయి బౌలర్లున్నారు. కానీ ఒక్క ఉమేశ్ యాదవ్ తప్ప మిగిలినవాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. కమిన్స్.. 4 మ్యాచులాడి 4 వికెట్లే తీశాడు. కానీ ప్రతి మ్యాచ్ లో 50కి తక్కువ కాకుండా పరుగులిచ్చాడు. సౌథీని 6 మ్యాచులు ఆడిస్తే అతడు 11 వికెట్లు పడగొట్టాడు. ఉమేశ్ యాదవ్ 10 మ్యాచుల్లో 15 వికెట్లతో ఉన్నంతలో మెరుగైన ప్రదర్శనలు చేశాడు. ఈ ఏడాది కేకేఆర్ లో అభిమానులు ఏదైనా సంబరపడే అంశముందా..? అంటే అది ఉమేశ్ యాదవ్ బౌలింగ్ ఒక్కటే. వరుణ్ చక్రవర్తి 8 మ్యాచుల్లో తీసింది నాలుగు వికెట్లే.
కెప్టెన్ గా శ్రేయస్..
ఐదు సీజన్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడి బ్యాటర్ గానే గాక రెండు సీజన్లలో ఆ జట్టును విజయవంతంగా నడిపించిన ఆ జట్టు మాజీ నాయకుడు శ్రేయస్ అయ్యర్.. ఈ సీజన్ లో మాత్రం విఫలమయ్యాడు. కెప్టెన్ గా అతడి వ్యూహాలు, జట్టు కూర్పు ఏమంత భాగోలేదన్నద కేకేఆర్ అభిమానులే చెబుతున్న మాట. కేకేఆర్ చరిత్రలో ఇంత చెత్త జట్టును ఎప్పుడూ చూడలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే భవిష్యత్ భారత జట్టు సారథి రేసులో కెఎల్ రాహుల్, రిషభ్ పంత్ తో పోటీ పడుతున్న శ్రేయస్.. తననెందుకు ఆ పోస్ట్ కు ఎంపిక చేయాలో ఐపీఎల్ లో మాత్రం సమాధానం చెప్పలేకపోయాడు. బ్యాటర్ గా కూడా రెండు మూడు మ్యాచులలో భారీ ఇన్నింగ్స్ లు తప్పితే మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ అయితే ఆడలేదు.
ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించినట్టే..
శనివారం లక్నోతో ముగిసిన మ్యాచ్ లో 75 పరుగుల తేడాతో ఓడిన కేకేఆర్.. ప్లేఆఫ్ రేస్ నుంచి దాదాపు నిష్క్రమించినట్టే. ఆ జట్టు ప్లేఆఫ్ చేరాలంటే తర్వాత ఆడే మూడు మ్యచుల్లో భారీ తేడాతో నెగ్గినా కష్టమే. మిగతా జట్ల విజయాలు, కేకేఆర్ నెట్ రన్ రేట్ (-0.304) కూడా మెరుగుపడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవేవీ జరిగే పనులు కావు. ఈ సీజన్ కోల‘కథ’ ముగిసినట్టే..
