సారాంశం

ఐపీఎల్‌లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడే  వెంకటేశ్ అయ్యర్ ఇటీవలే ముగిసిన సీజన్‌లో రాణించాడు. తాజాగా అయ్యర్ దోతి కట్టుకుని  క్రికెట్ ఆడాడు. 

ఐపీఎల్‌లో కోల్కతా నైట్ రైడర్స్   కీలక ఆటగాడు, దేశవాళీలో మధ్యప్రదేశ్ తరఫున ఆడే వెంకటేశ్ అయ్యర్  దోతి కట్టుకుని  క్రికెట్ ఆడాడు. తమిళనాడు లోని ఓ సంప్రదాయ బ్రహ్మణ కుటుంబానికి చెందిన అయ్యర్.. దేశవాళీలో మధ్యప్రదేశ్ తరఫున ఆడతాడు.  ఐపీఎల్ ముగిసిన తర్వాత కాంచీపురం (కంచి)లో  ఓ వేద పాఠశాలకు వచ్చిన అయ్యర్.. అక్కడ  చదువుకుంటున్న పిల్లలతో కలిసి  సంప్రదాయ దుస్తులు కట్టుకుని క్రికెట్ ఆడటం విశేషం. 

ఇందుకు సంబంధించిన వీడియోను అయ్యర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు.  వేద పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలతో  క్రికెట్ ఆడిన వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘ఆట (క్రికెట్) పట్ల  వీరికి ఉన్న ప్రేమ నమ్మశక్యం కానిది. కాంచీపురంలోని వేద పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులతో ఇలా సరదాగా గడిపాను..’ అని  అయ్యర్ రాసుకొచ్చాడు. 

వేద పాఠశాల విద్యార్థులతో క్రికెట్ ఆడిన అయ్యర్.. తనదైన శైలిలో  భారీ షాట్లు ఆడి  అక్కడనున్న వారిని అలరించాడు.  ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. 

 

View post on Instagram
 

కొద్దిరోజుల క్రితం మధ్యప్రదేశ్‌లో వేద పండితుల క్రికెట్ టోర్నీ అని  ఓ వీడియో వైరల్ అయింది. ఇందులో ఆడేవాళ్లంతా వేదాలను అవపోసన పట్టినవాళ్లే. రెగ్యులర్ గా క్రికెట్ ఆడేవాళ్లలాగా  టీషర్ట్, ప్యాంట్, షూస్ వంటివి లేకుండా పంచెకట్టు కట్టుకుని  క్రికెట్ ఆడతారు.  ఈ టోర్నీలో కామెంట్రీ కూడా సంస్కృతంలోనే ఉంటుంది. 

కాగా 28 ఏండ్ల  అయ్యర్.. ఇటీవలే ముగిసిన ఐపీఎల్-16 లో  దుమ్మురేపాడు. గతేడాది స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమైన అయ్యర్.. ఈ సీజన్ లో 14 ఇన్నింగ్స్ లలో 404 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. కేకేఆర్ తరఫున  ఐపీఎల్ లీగ్ ఫస్ట్ మ్యాచ్ లో  సెంచరీ చేసిన బ్రెండన్ మెక్‌కల్లమ్ తర్వాత  ఆ జట్టు తరఫున రెండో సెంచరీ చేసిన ఆటగాడు   వెంకటేశ్ మాత్రమే.  ముంబై ఇండియన్స్ తో వాంఖెడే వేదికగా ముగిసిన మ్యాచ్ లో అయ్యర్ 49 బంతుల్లోనే సెంచరీ చేశాడు. అతడు సెంచరీ చేసినా కేకేఆర్ మాత్రం  మ్యాచ్ ఓడింది. ఈ సీజన్ లో కేకేఆర్ నిరాశజనకమైన ప్రదర్శనలతో  ఏడో స్థానంలో నిలిచింది.   

 

View post on Instagram