వెస్టిండీస్‌లో క్రికెట్ అభివృద్ధి, మేటి క్రికెటర్ల ఎంపిక నిమిత్తం ఉద్దేశించిన కరేబియన్ ప్రీమియర్ లీగ్‌ (సీపీఎల్)లోకి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఎంటరైంది. సీపీఎల్‌లోని సెంట్ లూసియా జౌక్స్‌ను పంజాబ్ యాజమాన్యం కొనుగోలు చేసింది.

ఇందుకు సంబంధించి ఒప్పందం చేసుకోవడానికి జట్టు సహ యమాని మోహిత్ బర్మన్ అక్కడికి వెళ్లినట్లు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యజమాని నెస్‌వాడియా తెలిపారు. కరేబియన్ ప్రీమియర్‌ లీగ్‌లో భాగస్వామ్యం అయ్యేందుకు ఒప్పందం చేసుకోబోతున్నామని.. సెంట్ లూసియా జట్టును కొనుగోలు చేసుకోబోతున్నట్లు ఆయన చెప్పారు.

Also Read:2011 ప్రపంచ కప్ విజయం: టెండూల్కర్ కు ప్రతిష్టాత్మక అవార్డు

బీసీసీఐ నుంచి ఇతర అనుమతులు వచ్చాక అసలు విషయాలు వెల్లడిస్తామని వాడియా పేర్కొన్నారు. ఈ వార్తల నేపథ్యంలో సెంట్ లూసియా ప్రధాని అలెన్ చస్టానెట్, పర్యాటక శాఖ మంత్రి డొమినిక్ ఫెడ్డెకు వాడియాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

కాగా కరేబియన్ లీగ్‌లోకి ప్రవేశించిన తొలి విదేశీ యాజమాన్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్ రికార్డు సృష్టించింది. 2015లోనే కోల్‌కతా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

Also Read:కోహ్లీ నయా రికార్డు... దేశంలోనే నెంబర్ వన్ స్థానం

2013లో ప్రారంభమైన కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఇప్పటికీ దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇందులో మొత్తం ఆరు జట్లు పాలుపంచుకుంటున్నాయి. వీటిలో కోల్‌కతాకు చెందిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ అత్యథికంగా మూడు సార్లు టైటిల్‌ను సొంతం చేసుకుంది.

సీపీఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పీట్ రసెల్ మాట్లాడుతూ.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యాజమాన్యం సీపీఎల్‌లో భాగస్వామ్యమవ్వడం సంతోషంగా ఉందన్నారు. కాగా సీపీఎల్ ఎనిమిదో సీజన్ ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 26 వరకు జరగనుంది.