Joe Root:  ఇంగ్లాండ్ వరుస వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న జో రూట్... బెన్ స్టోక్స్‌కి కెప్టెన్సీ దక్కే అవకాశం... 

ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఇంగ్లాండ్ టెస్టు టీమ్ వరుస వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు జో రూట్. ‘నా దేశానికి కెప్టెన్‌గా వ్యవహరించే బాధ్యత దక్కడాన్ని గర్వంగా భావిస్తున్నా. గత ఐదేళ్ల కెప్టెన్సీ ప్రయాణం నాకు సంతోషాన్ని, గర్వాన్ని ఇచ్చింది. ఇంగ్లాండ్ క్రికెట్‌కి గర్వకారణమైన టెస్టు ఫార్మాట్‌కి కెప్టెన్‌గా వ్యవహరించడాన్ని గర్వంగా భావిస్తున్నా. నా తర్వాతి సారథి, టీమ్ మేట్స్‌, కోచ్‌లకి అన్ని విధాల సాయం చేసేందుకు నేనెప్పుడూ సిద్ధంగా ఉంటా..’ అంటూ తన ప్రకటనలో తెలియచేశాడు జో రూట్... 

గత ఏడాది భారత పర్యటనకి వచ్చినప్పటి నుంచి ఇంగ్లాండ్ టీమ్‌కి ఏదీ కలిసి రావడం లేదు... భారత పర్యటనలో టెస్టు సిరీస్‌ని 3-1 తేడాతో కోల్పోయిన ఇంగ్లాండ్ టెస్టు జట్టు, ఆ తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్ చేతుల్లో 1-0 తేడాతో టెస్టు సిరీస్ ఓడింది. ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు నాలుగు టెస్టులు ఆడి 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే ఆఖరి టెస్టు మ్యాచ్ కరోనా కారణంగా వాయిదా పడి, ఈ ఏడాది జూన్‌లో జరగనుంది...

భారీ అంచనాలతో యాషెస్ సిరీస్‌ కోసం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన జో రూట్ సేన, 4-0 తేడాతో చిత్తుగా ఓడింది. ఆ తర్వాత ఫామ్‌లోని వెస్టిండీస్‌తోనూ టెస్టు సిరీస్ కోల్పోయింది ఇంగ్లాండ్ జట్టు. విండీస్ పర్యటనలో 1-0 తేడాతో టెస్టు సిరీస్ కోల్పోయింది. ఆఖరి టెస్టులో 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ని చిత్తు చేసింది వెస్టిండీస్...

ఏ జట్టుకైనా ఓటములు సహజం. టైమ్ బాగోలేనప్పుడు, స్టార్ ప్లేయర్లు అందుబాటులో లేనప్పుడు వరుస పరాజయాలు ఎదుర్కోక తప్పదు. అయితే ఇంగ్లాండ్ కథ వేరు. ఇంగ్లాండ్ టీమ్‌కి జోఫ్రా ఆర్చర్ మినహా ఇస్తే స్టార్ ప్లేయర్లు అందరూ జట్టుకి అందుబాటులోనే ఉన్నారు. అయినా కనీస పోరాటం కూడా చేతులు ఎత్తేస్తోంది ఇంగ్లాండ్ జట్టు...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2021-23 సీజన్‌లో ఇప్పటికే 13 టెస్టులు ఆడిన ఇంగ్లాండ్ జట్టు ఒకే ఒక్క విజయం అందుకుని 7 మ్యాచుల్లో పరాజయం పాలైంది. నాలుగు టెస్టులు డ్రా చేసుకోగా ఓ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దయ్యింది...

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్, ఫైనల్‌కి అర్హత సాధించడం అసాధ్యమే. ఇంగ్లాండ్ జట్టు కంటే ఫామ్‌లో లేని శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్లు మంచి పొజిషన్‌లో ఉండడం జో రూట్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు రావడానికి కారణమైంది.

యాషెస్ సిరీస్ ఓటమి తర్వాత ఇంగ్లాండ్ హెడ్ కోచ్ పొజిషన్ నుంచి క్రిస్ సిల్వర్‌వుడ్‌ని తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. ఆ సమయంలోనే జో రూట్ కెప్టెన్సీపై కూడా వేటు పడుతుందని ప్రచారం జరిగింది...

అయితే బ్యాటింగ్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న జో రూట్ గత 15 నెలల కాలంలో 8 టెస్టు సెంచరీలు చేశాడు. గత ఏడాది 6 భారీ సెంచరీలతో 1700+ పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేశాడు.

బ్యాటింగ్‌లో తనవంతు సహకారం అందిస్తుండడంతో జో రూట్‌పై వేటు వేయడానికి ఆలోచించింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. తనని తప్పుకోమ్మంటే తప్పుకుంటానని ప్రకటించిన జో రూట్, ఎట్టకేలకు వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత టెస్టు కెప్టెన్సీకి రాజీనామా సమర్పించాడు. 

జో రూట్ రాజీనామాతో ఆ బాధ్యతలు బెన్ స్టోక్స్‌కి దక్కే అవకాశం ఎక్కువగా ఉంది. టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా ఉన్న బెన్ స్టోక్స్, పాకిస్తాన్ జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించినప్పుడు ప్రధాన జట్టు ప్లేయర్లు కరోనా పాజిటివ్‌గా తేలడంతో కెప్టెన్‌గా వ్యవహరించి సిరీస్ కూడా గెలిచాడు.