సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుండేే క్రికెటర్లలో న్యూజిలాండ్ ఆల్ రౌండర్ జేమ్స్ నీషమ్ ముందు వరుసలో వుంటాడు. కేవలం క్రికెట్ కు సంబంధించిన విషయాలను పంచుకోడానికే కాకుండా అభిమానులతో కూడా సరదాగా ఇంటరాక్ట్ అవ్వడానికి అతడు వివిధ సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగిస్తుంటాడు. ఇందులో భాగంగానే ఇటీవల ఇన్ట్సాగ్రామ్ వేదికన ''ఆస్క్ మీ ఎనీ థింగ్ ( ఏ విషయం గురించయినా నన్ను అడగండి)'' అంటూ అభిమానులకు దగ్గరయ్యే కార్యక్రమాన్ని చేపట్టాడు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన  కొన్ని ప్రశ్నలకు నీషమ్ సరదా సమాధానాలిచ్చి ఆకట్టుకున్నాడు. 

 ఈ ''ఆస్క్ మీ ఎనీ థింగ్'' కాంటెస్ట్ లో భాగంగా ఓ అభిమాని నీషమ్ ను ఇండియన్ క్రికెట్ గురించి ప్రశ్నించాడు. ''టీమిండియా క్రికెటర్లలో మీ ఫేవరెట్ ఎవరు..?''    అని ప్రశ్నించాడు. అయితే ఈ ప్రశ్నకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ప్రస్తుత విరాట్ కోహ్లీ, ప్రపంచ కప్ టోర్నీలో అదరగొట్టిన రోహిత్ శర్మ, యువ బౌలర్ జస్ప్రీత్ సింగ్ బుమ్రాలలో ఎవరో ఒకరి పేరును చెబుతాడని అందరూ అనుకున్నారు. లేదంటే మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ వంటి  సీనియర్లలో ఎవరినైనా తన పేవరెట్ అని చెప్పవచ్చని భావించారు. కానీ నీషమ్ వీరెవరూ  కాకుండా ఓ కొత్తపేరు చెప్పి అందరినీ ఆశ్యర్యానికి గురిచేశాడు. 

''నాకు భారత క్రికెటర్ల కంటే భారతీయ క్రికెటర్ ఇష్ సోథీ అంటే చాలా ఇష్టం. అతడి లెగ్ స్పిన్  బౌలింగ్ ను నేను బాగా ఇష్టపడతాను.'' అంటూ సదరు అభిమానికి నీషమ్ చమత్కారంగా సమాధానం చెప్పాడు. 

ఇష్ సోథీ భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ క్రికెటర్. సోథి పూర్వికులు భారతదేశానికి చెందినవారు. ఉపాధినిమిత్తం న్యూజిలాండ్ కు వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. అలా వారి సంతతి న్యూజిలాండ్ పౌరులుగా మారిపోయారు.