రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో సౌరాష్ట్ర టీమ్ తరుపున ఆడబోతున్న జయ్‌దేవ్ ఉనద్కట్... బెంగాల్‌తో రంజీ ఫైనల్ ముగిసిన తర్వాత తిరిగి టీమిండియాలోకి... 

బంగ్లాదేశ్ టూర్‌కి ముందు మహ్మద్ షమీ గాయపడడంతో అతని స్థానంలో టెస్టు టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు జయ్‌దేవ్ ఉనద్కట్. అప్పుడెప్పుడో 2010లో 19 ఏళ్ల వయసులో టెస్టు ఆరంగ్రేటం చేసిన జయ్‌దేవ్ ఉనద్కట్, ఆ మ్యాచ్ తర్వాత 12 ఏళ్లకు రెండో టెస్టు ఆడాడు...

బంగ్లాదేశ్ వీసా రాకపోవడంతో తొలి టెస్టు ఆడలేకపోయాడు జయ్‌దేవ్ ఉనద్కట్. 12 ఏళ్ల తర్వాత టెస్టు టీమ్‌లోకి వచ్చిన సౌరాష్ట్ర కెప్టెన్ కోసం ఏకంగా తొలి టెస్టులో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచిన కుల్దీప్ యాదవ్‌నే పక్కనబెట్టేశాడు తాత్కాలిక కెప్టెన్ కెఎల్ రాహుల్...

బంగ్లాతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీసిన జయ్‌దేవ్ ఉనద్కట్, బ్యాటుతో 14 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఓ వికెట్ తీసి టెస్టు టీమ్‌లో ప్లేస్‌ని నిలుపుకున్నాడు. బంగ్లా టూర్ ముగిసిన తర్వాత రంజీ టీమ్‌తో కలిసిన జయ్‌దేవ్ ఉనద్కట్, సౌరాష్ట్ర తరుపున అదరగొట్టాడు...

ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రంజీ ట్రోఫీ చరిత్రలో మొట్టమొదటి ఓవర్‌లోనే హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు జయ్‌దేవ్ ఉనద్కట్... మొదటి ఓవర్‌లో మూడు బంతుల్లో మూడు వికెట్లు తీశాడు ఈ సౌరాష్ట్ర కెప్టెన్. మూడో బంతికి ధృవ్ షోరేని అవుట్ చేసిన జయ్‌దేవ్ ఉనద్కట్, ఆ తర్వాత వెంటవెంటనే వైభవ్ రావల్, యశ్ ధుల్‌లను పెవిలియన్ చేర్చాడు.

జయ్‌దేవ్ బౌలింగ్ ధాటికి ఈ ముగ్గరూ డకౌట్ అయ్యారు... జయ్‌దేవ్ ఉనద్కట్ ప్రతాపం అక్కడితో ఆగలేదు. ఆ తర్వాతి ఓవర్‌లో జాంటీ సింధు, లలిత్ యాదవ్ కూడా పెవిలియన్ చేరారు. తొలి రెండు ఓవర్లలో 5 పరుగులిచ్చిన జయ్‌దేవ్ ఉనద్కట్, ఐదు వికెట్లు తీశాడు. ఆ లంచ్ తర్వాత లక్ష్యయ్ తరేజా కూడా జయ్‌దేవ్ ఉనద్కట్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు...

తొలి సెషన్‌లో 9 ఓవర్లు బౌలింగ్ చేసిన జయ్‌దేవ్ ఉనద్కట్, 29 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. రెండో సెషన్‌లో మరో 2 వికెట్లు తీశాడు. మొత్తంగా తొలి ఇన్నింగ్స్‌లో 12 ఓవర్లు వేసిన జయ్‌దేవ్ ఉనద్కట్ 39 పరుగులిచ్చి 8 వికెట్లు తీశాడు.

ఈ పర్ఫామెన్స్‌తో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో జయ్‌దేవ్ ఉనద్కట్‌కి చోటు దక్కింది. తొలి టెస్టులో మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీలను ఆడించిన టీమిండియా, జయ్‌దేవ్ ఉనద్కట్‌కి రిజర్వు బెంచ్‌కే పరిమితం చేసింది...

తాజాగా సౌరాష్ట్ర, రంజీ ట్రోఫీ 2023 ఫైనల్‌కి చేరుకోవడంతో జయ్‌దేవ్ ఉనద్కట్, టీమిండియాని వీడి, తన రంజీ జట్టులో చేరబోతున్నాడు. అర్పిత్ వసవడా కెప్టెన్సీలో కర్ణాటక జట్టుతో జరిగిన సెమీ ఫైనల్‌లో 4 వికెట్ల తేడాతో గెలిచి, ఫైనల్ చేరింది సౌరాష్ట్ర... 

2020లో ఫైనల్‌లో బెంగాల్‌ని ఓడించి, మూడోసారి రంజీ ట్రోఫీని గెలిచింది సౌరాష్ట్ర. 2023 రంజీ ట్రోఫీ ఫైనల్‌లోనూ మరోసారి బెంగాల్ జట్టుతోనే తలబడనుంది సౌరాష్ట్ర. ఈ మ్యాచ్ కోసం జయ్‌దేవ్ ఉనద్కట్, టీమిండియాని వీడి తన జట్టుతో కలవబోతున్నాడు...

రెండో టెస్టుకి దూరంగా ఉండే జయ్‌దేవ్ ఉనద్కట్, ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభమయ్యే ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత తిరిగి భారత జట్టుతో కలవబోతున్నాడు..