దేశవాళీ క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీని తొలిసారి కైవసం చేసుకొని సౌరాష్ట్ర చరిత్ర సృష్టించింది. గత దఫాలో ఆఖరుకి మెట్టు వద్ద తత్తరపడ్డ సౌరాష్ట్ర ఈసారి తమ కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ హీరోయిక్స్ తో టైటిల్ ను సొంతం చేసుకుంది. 

సెమీఫైనల్స్ లో గుజరాత్ ను ఒంటి చేత్తో మట్టికరిపించి సౌరాష్ట్రను ఫైనల్స్ లో నిలిపిన కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ మరోసారి విజృంభించడంతో సౌరాష్ట్ర బెంగాల్ పై అద్వితీయమైన విజయాన్ని సొంతం చేయేసుకుంది. తొలి ఇన్నింగ్స్ లీడ్ ద్వారా ఈ మ్యాచును, టైటిల్ ను సౌరాష్ట్ర ఎగరేసుకుపోయింది. 

13 ఏండ్ల సుదీర్ఘ విరామం అనంతరం రంజీ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించిన బెంగాల్‌, కూడా అంతిమ సమరంలో అపూర్వ పోరాట స్ఫూర్తి కనబరుస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర 425 పరుగుల భారీ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం ఖాయమనే దీమాలో ఉండగా.. బెంగాల్‌ బ్యాట్స్‌మెన్‌ పోరాట స్ఫూర్తిని నమ్ముకున్నారు. 

రన్‌రేట్‌ తక్కువగా ఉన్నా సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌ను అందుకునేందుకు అసమాన పోరాటం చేసారు.  సుదిప్‌ చటర్జి (81), వృద్దిమాన్‌ సాహా (64), మజుందార్‌ (58 నాటౌట్‌), అర్నబ్‌ నంది (28 నాటౌట్‌) రాణించటంతో బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 354/6 ఓవర్ నైట్ స్కోర్ తో ఐదవ రోజు ఆటను ప్రారంభించారు. 

మూడో రోజు 291 పరుగుల వెనుకంజలో నిలిచిన బెంగాల్‌, నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి 71 పరుగులకు అంతరాన్ని తగ్గించింది. నేడు ఆఖరు రోజు ఆటలో బెంగాల్‌కు 72 పరుగులు అవసరం కాగా.. ఆ మార్క్‌ చేరుకునేలోపే నాలుగు వికెట్లను సౌరాష్ట్ర కూల్చింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో రంజీ ట్రోఫీ ఫైనల్స్‌ ఐదో రోజుకు అభిమానులను స్టేడియంలోకి అనుమతించ లేదు.

సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ నిప్పులు చెరిగే బౌలింగ్ తో బెంగాల్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఇక బెంగాల్ ఇన్నింగ్స్ ముగిసిన తరువాత సౌరాష్ట్ర నామ్ కే వాస్తే ఆడాల్సిన ఆటను ఆడింది. ఇరు జట్ల కెప్టెన్లు మ్యాచ్ అయిపోయిందని ప్రకటించే వరకు ఆడేసి... ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ ఉండడంతో సౌరాష్ట్ర విజేతగా నిలిచింది. 

ఇక ఈ సిరీస్ లో న్యూజిలాండ్ పర్యటన అనంతరం రవీంద్ర జడేజాను సౌరాష్ట్ర తరుఫున ఆడనివ్వాలని సౌరవ్ గంగూలీని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కోరింది. కానీ గంగూలీ దాన్ని తిరస్కరించడంతో... వారు ఆగ్రహం వ్యక్తం చేసారు. దేశవాలీ క్రికెట్ కు వైభవం తీసుకురావాలంటే స్టార్స్ ఆడినప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని వారు అన్నారు.