ఈ ఏడాది సూపర్‌ ఫామ్‌లో ఉన్న టీమిండియా ఫాస్ట్‌బౌలర్ జస్ప్రీత్ బుమ్రా విండీస్ పర్యటనలోనూ తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. రెండో టెస్టులో భాగంగా వరుస బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

తొమ్మిదో ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన బుమ్రా రెండో బంతికి బ్రావో.. మూడో బంతికి బ్రూక్స్‌ను ఎల్బీగా వెనక్కి పంపాడు. అనంతరం నాలుగో బంతికి చేజ్‌ను వికెట్ల ముందు బొల్తాకొట్టించాడు.

నాలుగో బంతికి చేజ్ ప్యాడ్లకు బంతి తగిలినా... బంతి ప్యాడ్లను తాకిందేమోనని అనుమానంతో అప్పీల్ చేయలేదు. అయితే కోహ్లీ మాత్రం బంతి ప్యాడ్‌ను తాకిందని బలంగా నమ్మి గట్టిగా అప్పీల్ చేశాడు.

ఫీల్డ్ అంపైర్ నిరాకరించడంతో కోహ్లీ సమీక్షకు వెళ్లాడు. విరాట్ అనుకున్నట్లుగానే రివ్యూలో బంతి చేజ్ ప్యాడ్‌ను తాకినట్లు తేలింది. అంతే భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు.

కాగా.. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది మూడో హ్రాట్రిక్.. అంతకుముందు 2001లో స్పిన్నర్ హార్భజన్ సింగ్ ఆస్ట్రేలియాపై హ్యాట్రిక్ నమోదు చేయగా.. 2006లో ఇర్ఫాన్ పఠాన్ పాకిస్తాన్‌పై హ్యాట్రిక్ వికెట్లు తీశాడు.

13 ఏళ్ల తర్వాత తాజాగా బుమ్రా ఈ ఘనత అందుకున్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్ తన మొదటి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. హామిల్టన్ 2, కార్న్‌వెల్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.