29 బంతుల్లో సెంచరీ... వన్డేల్లో ఏబీ డివిల్లియర్స్ రికార్డు బ్రేక్! అయినా దక్కని విజయం..
ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్ టోర్నీలో 29 బంతుల్లో సెంచరీ... క్రిస్ గేల్, ఏబీ డివిల్లియర్స్ రికార్డులు బ్రేక్ చేసిన జాక్ ఫ్రాసర్-మెక్‌గుర్క్...
లిస్టు-A క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఏబీ డివిల్లయర్స్ రికార్డు బ్రేక్ అయ్యింది. 2015లో ఏబీ డివిల్లియర్స్, వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్‌లో 31 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు. తాజాగా సౌతాఫ్రికా బ్యాటర్ జాక్ ఫ్రాసర్-మెక్‌గుర్క్ కేవలం 29 బంతుల్లో సెంచరీ బాది, వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు..
ఆస్ట్రేలియా డొమెస్టిక్ క్రికెట్ టోర్నీ ది మార్ష్ కప్‌లో భాగంగా టస్మానియా, సౌత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిందీ రికార్డు ఫీట్. తొలుత బ్యాటింగ్ చేసిన టస్మానియా, నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 435 పరుగుల భారీ స్కోరు చేసింది..
కలెబ్ జెవెల్ 90, జాక్ వెథరలా్డ్ 35, చార్లీ వకీం 48, మకలిస్టర్ రైట్ 51, బో వెబ్‌స్టర్ 42, మిచెల్ ఓవెన్ 15 పరుగులు చేయగా కెప్టెన్ జోర్డన్ సిల్క్ 85 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 116 పరుగులు చేశాడు..
436 పరుగుల లక్ష్యఛేదనలో సౌత్ ఆస్ట్రేలియాకి అదిరిపోయే ఆరంభం అందించాడు జాక్ ఫ్రాసర్-మెక్‌గుర్క్ . 29 బంతుల్లో సెంచరీ బాదిన జాక్ ఫ్రాసర్-మెక్‌గుర్క్ , 38 బంతుల్లో 10 ఫోర్లు, 13 సిక్సర్లతో 328.94 స్ట్రైయిక్ రేటుతో 125 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. జాక్ ఫ్రాసర్-మెక్‌గుర్క్ అవుట్ అయ్యే సమయానికి 11.4 ఓవర్లలోనే 172 పరుగులు చేసింది సౌత్ ఆస్ట్రేలియా..
హెన్రీ హంట్ 51, డానియల్ డ్యూ 52, నాథన్ మెక్‌స్వీనీ 62, జాక్ లెహ్మన్ 35, నాథన్ మెక్‌ఆండ్రూ 29 పరుగులు చేసినా సౌత్ ఆస్ట్రేలియాకి విజయాన్ని అందించలేకపోయారు. 46.4 ఓవర్లలో సౌత్ ఆస్ట్రేలియా 398 పరుగులకి ఆలౌట్ అయ్యింది. టస్మానియాకి 37 పరుగుల తేడాతో విజయం దక్కింది..టీ20 ఫార్మాట్‌లో 30 బంతుల్లో సెంచరీ బాదిన క్రిస్ గేల్ రికార్డు కూడా బ్రేక్ చేసిన జాక్ ఫ్రాసర్-మెక్‌గుర్క్, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు.