Asianet News TeluguAsianet News Telugu

అలా అయితే తప్ప..!‘ఇంపాక్ట్ ప్లేయర్’పై ఢిల్లీ హెడ్ కోచ్ కామెంట్స్

IPL 2023:  ఈ ఏడాది నుంచి  ఐపీఎల్ లో  పలు కీలక నిబంధనలు రాబోతున్నాయి. అందులో ముఖ్యంగా   అందరూ చర్చించుకుంటున్నది ‘ఇంపాక్ట్ ప్లేయర్’ గురించే.. 

It actually almost negates the role of allrounders: Ricky Ponting On Impact Player Rule MSV
Author
First Published Mar 25, 2023, 3:45 PM IST

ఇండియన్  ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)  కొత్త ఎడిషన్  ఈనెల 31 నుంచి మొదలుకానున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ లో  పలు కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. గతంలో టాస్ వేయకుముందే  ఇరు జట్ల సారథులు   తమ ‘టీమ్ షీట్’ను మార్చుకునేవారు.  కానీ  త్వరలో జరుగబోయే సీజన్ లో మాత్రం.. టాస్ వేసిన తర్వాత  మ్యాచ్ ఆరంభానికి ముందు కూడా  తుది జట్టులో మార్పులు చేసుకోవచ్చు. ఈ ఏడాది నుంచి ఐపీఎల్ లో ప్రవేశపెట్టబోతున్న ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ కు  పైన పేర్కొన్న   రూల్ ఛేంజ్ బాగా ఉపయోగపడుతుందని వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో  దీనిపై  తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్  హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు  చేశాడు. 

న్యూఢిల్లీలో ఢిల్లీ టీమ్  ట్రైనింగ్ శిబిరంలో పాల్గొంటున్న పాంటింగ్..  శనివారం  విలేకరుల సమావేశానికి వచ్చాడు. ఈ సందర్భంగా పాంటింగ్ మాట్లాడుతూ.. ‘దానిని (ఇంపాక్ట్ ప్లేయర్ రూల్) ను ఎలా వాడాలన్నది టాస్ ను ఆధారపడి ఉంటుంది. మీరు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తారా..? బౌలింగ్ చేస్తారా..? అన్నదానిపై  ఇంపాక్ట్ ప్లేయర్ పై ఓ అవగాహన వస్తుంది.. 

టాస్ లో మీరు ఒకవేళ మీరు బ్యాటింగ్ చేస్తే  త్వరత్వరగా రెండు వికెట్లు పడితే సబ్‌స్టిట్యూట్ ను  దించొచ్చు. అదీగాక మ్యాచ్ మధ్యలో  స్కోరు మరీ తక్కువగా ఉన్నప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ ను బరిలోకి దింపొచ్చు.   ఏడో స్థానంలో ఆడించాలనుకున్న బ్యాటర్ ను నేరుగా నాలుగో స్థానానికి పంపొచ్చు.   ఇంపాక్ట్ ప్లేయర్ అనే కాన్సెప్ట్ గేమ్ లో ఆల్ రౌండర్ల పాత్రకు  నష్టం చేకూర్చేదే. ఒకవేళ సదరు ఇంపాక్ట్ ప్లేయర్  ప్రపంచస్థాయి ఆటగాడు అయితే ఆ క్రికెటర్  ఆట మీద ప్రభావం చూపగలుగుతాడు.   వరల్డ్ క్లాస్ ప్లేయర్ అయితే  తప్ప ఇతడిని జట్లు పెద్దగా ఉపయోగిస్తాయని నేనైతే అనుకోను..’ అని చెప్పాడు. 

కాగా.. అసలు మ్యాచ్ జరిగేప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ ఎప్పుడొస్తాడు..? అతడిని ఎలా ఉపయోగించాలి..?  అంటేవాటిమీద   సీజన్ మొదలైతే గానీ ఒక అవగాహన రాదు. అన్నింటికంటే ముందు ఈ  ప్లేయర్  ఫీల్డ్ లోకి రావడానికి  సూచిక ఏంటి..? అన్నదానికి బీసీసీఐ తాజాగా సమాధానమిచ్చింది.   

 

సిక్సర్, ఫోర్, ఔట్, నోబాల్, వైడ్ కు  చేతి సూచికల ద్వారా  అంపైర్లు వారి నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ ఎంట్రీ కూడా  అంపైర్ల ‘చేతుల్లోనే’ ఉంది.  ఇంపాక్ట్ ప్లేయర్ కోసం  కెప్టెన్ ఆన్ ఫీల్డ్ అంపైర్లను  కోరితే అప్పుడు సదరు ఆటగాడు  క్రీజులోకి వస్తాడు.   దీనికోసం కూడా ఓ సూచిక ఉంది.   బీసీసీఐ తాజాగా ఇందుకు సంబంధించిన చిత్రాన్ని విడుదల చేసింది.  ఇంపాక్ట్ ప్లేయర్ ఆగమనాన్ని  సూచించేందుకు గాను అంపైర్లు.. రెండు చేతులను తల పైకెత్తి  (సిక్సర్ మాదిరిగా)  అందులో ఒక చేతిని   క్రాస్ పొజిషన్ లో పెడతారు. ఒక చేతి పిడికిలి బిగించి ఉంటుంది. మరో చేయి మాత్రం  సమాంతరంగా ఉంటుంది.  ఇదే ఇంపాక్ట్ ప్లేయర్ రాకకు సూచన. 

Follow Us:
Download App:
  • android
  • ios