Vaibhav Suryavanshi Age Controversy: వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచంలో సంచలనం. 12 ఏళ్లకే దేశవాళీ క్రికెట్, 14 ఏళ్లకే ఐపీఎల్ ఎంట్రీతో వైరల్ గా మారాడు. ఐపీఎల్ 2025లో సెంచరీ కొట్టిన యంగెస్ట్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. అయితే, వైభవ్ సూర్యవంశీ నిజంగానే 14 ఏళ్ల కుర్రాడా? లేదా మోసం చేశాడా? బీసీసీఐ బోన్ టెస్టు రిపోర్టులో ఏం తేలింది? వైభవ్ సూర్యవంశీ వయస్సు వివాదంలో నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Vaibhav Suryavanshi Age Controversy: 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించిన కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ప్రపంచ క్రికెట్ లో పెనుసంచలనం. ఐపీఎల్ మెగా వేలంలో 1.10 కోట్ల రూపాయలకు అతన్ని రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి తీసుకున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. విమర్శలు చేసినవారు కూడా ఉన్నారు.
కానీ, ఐపీఎల్ లో ఆడిన తొలి బంతినే సిక్సర్ కొట్టిన తన బ్యాట్ పవర్ చూపించాడు. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ పై సునామీ ఇన్నింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ సరైన నిర్ణయం తీసుకుందని నిరూపించాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. టీ20ల్లో అత్యంత చిన్న వయసులో సెంచరీ సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. అయితే, చాలా కాలం నుంచి వైభవ్ సూర్యవంశీ వయస్సుపై వివాదం నడుస్తోంది. అతని వయస్సు 14 ఏళ్లు కాదనీ, అంతకు ఎక్కువగానే ఉంటుందని ఆరోపణలు ఉన్నాయి.
ఐపీఎల్ లో సెంచరీ ఇన్నింగ్స్ తర్వాత కూడా మళ్లీ అతని వయస్సుకు సంబంధించిన వివాదం మొదలైంది. వైభవ్ ఆటతీరును చూసిన పలువురు క్రికెట్ అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు.. నిజంగా 14 ఏళ్లవాడేనా అంటూ సందేహాన్ని వ్యక్తం చేశారు. క్రికెట్ లో గతంలో కొంతమంది ఆటగాళ్లు వయసు విషయంలో మోసాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో వైభవ్ సూర్య వంశీ వయస్సుపై కూడా విదాదం మొదలైంది. ముఖ్యంగా వైభవ్ స్వరాష్ట్రం అయిన బీహార్ క్రికెట్ కు అందంచిన బర్త్ డే వివరాలు, ఒక ఇంటర్వ్యూలో అతను చెప్పిన వివరాలు ఒకేలా లేకపోవడంతో అతని వయస్సుపై వివాదం రాజుకుంది.
అయితే, ఈ నేపథ్యంలో వైభవ్ వయసు 14 ఏళ్లు నిజమేనని నిరూపించే పలు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 2017లో, ఆరు ఏళ్ల వయసులో వైభవ్ తండ్రితో కలిసి ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ను చూశాడని అప్పటి ఆర్పీఎస్ యజమాని గోయెంకా వెల్లడిస్తూ ట్వీట్ చేశాడు. అలాగే, మరొక ఫోటోలో, వైభవ్ 9 ఏళ్ల వయసులో ఒక ట్రిప్‌లో ఉన్నాడు. 2022లో తీసిన మరో ఫోటోలో11 ఏళ్ల వయసులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో కనిపిస్తున్నాడు. ఈ ఫోటోలన్నింటినీ గమనిస్తే, ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్ల వయసులోనే ఉన్నాడని స్పష్టమవుతోంది.
వైభవ్ వయస్సు వివాదం.. బీసీసీఐ ఏం తేల్చింది?
పలు ఆరోపణల మధ్య భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రంగంలోకి దిగి వైభవ్ సూర్యవంశీ వయస్సుపై విచారణ జరిపింది. ఇక అధికారికంగా అతని వయస్సును బీసీసీఐ నిర్ధారించింది. వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ మాట్లాడుతూ ..వైభవ్ వయసుపై ఎలాంటి సందేహం లేదు. బీసీసీఐ ఇప్పటికే అతడికి ఎనిమిదేళ్ల వయసులో బోన్ టెస్ట్ నిర్వహించి వయసు సరిగా ఉందని ధృవీకరించింది. వయసు మోసం ఆరోపణలకు తావు లేదని చెప్పాడు.
వైభవ్ అనుకున్నదాన్ని మించి చిన్న వయస్సులోనే క్రికెట్ లో ప్రతిభ చూపిస్తూ ముందుకు సాగుతున్నప్పటికీ, వయసుపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని తండ్రి స్పష్టీకరణ, బీసీసీఐ ధృవీకరణ, పాత ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.


