Asianet News TeluguAsianet News Telugu

చరిత్ర సృష్టించిన ఐర్లాండ్.. మాజీ ప్రపంచ ఛాంపియన్లను చిత్తుచిత్తుగా ఓడించిన పసికూన.. సిరీస్ కైవసం

West Indies Vs Ireland: పసికూన ఐర్లాండ్ చరిత్ర సృష్టించింది.  గతేడాది టీ20 ప్రపంచకప్ లో పలు అద్భుత ప్రదర్శనలతో మెరిసిన ఆ జట్టు.. ఇప్పుడు ఏకంగా మాజీ ప్రపంచ ఛాంపియన్లు అయిన వెస్టిండీస్ ను మట్టి కరిపించింది. 

Ireland Creates History, beat West Indies in sabina park and clinch the ODI Series
Author
Hyderabad, First Published Jan 17, 2022, 4:07 PM IST

క్రికెట్లో ‘పసి కూన’ అనే ట్యాగ్ తో ఉన్న ఐర్లాండ్ సంచలనం సృష్టించింది. మాజీ ప్రపంచ ఛాంపియన్లు, జట్టు నిండా ఆల్ రౌండర్లు, హిట్టర్లతో నిండి ఉన్న వెస్టిండీస్ ను మట్టి కరిపించింది.  వరుసగా రెండు వన్డేలలో  విండీస్ ను ఓడించి సిరీస్ ను కైవసం చేసుకుంది. నాలుగు వన్డేలలో భాగంగా.. సిరీస్ ను 2-1తో గెలుచుకుని చరిత్ర సృష్టించింది. తొలి వన్డే లో విండీస్ గెలువగా.. రెండో వన్డే కొవిడ్ కారణంగా రద్దైంది. మూడో వన్డేతో పాటు నాలుగో మ్యాచులో కూడా ఐర్లాండ్ గెలిచి ఏకంగా సిరీస్ ను చేజిక్కించుకుని ఆ దేశ క్రికెట్ చరిత్రలో  కొత్త అధ్యాయం లిఖించింది. 

ఐర్లాండ్ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు ఇది.. గత కొన్నాళ్లుగా క్రికెట్ ఆడుతున్న ఆ జట్టు.. తొలిసారి ఓ అగ్రశ్రేణి జట్టుతో వన్డే సిరీస్ ఆడటమే గాక ఏకంగా వరుసగా రెండు మ్యాచులు నెగ్గి సిరీస్ కూడా సొంతం చేసుకోవడం విశేషం. తద్వారా  విదేశీ గడ్డపై తమ తొలి సిరీస్ గెలుపు నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐర్లాండ్ ఆటగాడు మెక్బ్రైన్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 

 

జమైకాలోని సబీనా పార్క్ వేదికగా సాగిన నాలుగో వన్డేలో టాస్ గెలిచి  బౌలింగ్ ఎంచుకున్న ఐర్లాండ్..  హోప్, గ్రీవ్స్, పూరన్, చేజ్, పొలార్డ్, హోల్డర్ వంటి భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న విండీస్ ను 44.4 ఓవర్లలో 212 పరుగులకే కట్టడి చేసింది. వెస్టిండీస్ లో వికెట్ కీపర్ హోప్ (53) టాప్ స్కోరర్ కాగా హోల్డర్ (44) రాణించాడు. మిగిలినవాళ్లంతా నామమాత్రపు స్కోర్లకే వెనుదిరిగారు. కెప్టెన్ పొలార్డ్ (3) కూడా ఆదుకోలేదు.  ఐర్లాండ్ బౌలర్లలో మెక్బ్రైన్.. 10 ఓవర్లలో 28 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా.. క్రెయిగ్ యంగ్.. 7.4 ఓవర్లు వేసి 43 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. కంఫర్,డార్కెల్ లు తలో వికెట్  దక్కించుకున్నారు. 

 

213 పరుగుల లక్ష్య ఛేదనతో బ్యాటింగ్ ఆరంభించిన  ఐర్లాండ్ కు శుభారంభమేమీ దక్కలేదు. ఆ జట్టు ఓపెనర్ పోర్టర్ ఫీల్డ్ డకౌట్ అయినా.. కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (44), అండీ  మెక్బ్రైన్ (59) రాణించారు. వీరిద్దరూ ఔటైన తర్వాత వచ్చినే టెక్టర్ (52) కూడా హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. అయినా విండీస్ బౌలర్లు మాత్రం పట్టు వీడలేదు. టెక్టార్ ను ఔట్ చేయడంతో ఆ తర్వాత బ్యాటర్లంతా వచ్చినోళ్లు వచ్చినట్టే పెవిలియన్ కు చేరారు. కానీ చివర్లో డెలెని (10), క్రెయిగ్ యంగ్ (5 నాటౌట్) లు మిగతా లాంఛనాన్ని పూర్తి చేశారు. ఫలితంగా 44.5 ఓవర్లలో ఆ జట్టు  214 పరుగులు చేసి వన్డే తో పాటు సిరీస్ కూడా దక్కించుకుంది. ఫలితంగా ఆ జట్టు 2 వికెట్ల తేడాతో విండీస్ ను ఓడించి సిరీస్ ను గెలుచుకుంది.  

కాగా.. ఓటమి అనంతరం విండీస్ సారథి పొలార్డ్ స్పందిస్తూ.. ‘ఇది మాకు, వెస్టిండీస్ క్రికెట్ కు చాలా బాధాకరమైన రోజు. మా ప్రదర్శన చాలా నిరాశపరిచింది.  దీనిని జీర్ణించుకోవడం చాలా కష్టం. గత రెండు, మూడేండ్లుగా మా జట్టును బ్యాటింగ్ సమస్య వేధిస్తున్నది. మేం బాగా బ్యాటింగ్ చేస్తేనే బౌలర్లు దానిని రక్షించగలరు..’ అని  ఆవేదన వ్యక్తం చేశాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios