IPL 2023 టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్... గాయం నుంచి కోలుకున్న జోష్ హజల్‌వుడ్...
ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా నేడు లక్నోలోని భారత రత్న అట్టల్ బిహారీ ఏకనా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు..
ఇరు జట్ల మధ్య సీజన్ ఆరంభంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో అద్భుత విజయం అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీకి కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ కలిసి హాఫ్ సెంచరీలతో రాణించి 212 పరుగుల భారీ స్కోరు అందించారు.
లక్ష్యఛేదనలో 105 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన లక్నో సూపర్ జెయింట్స్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోనీ, మార్కస్ స్టోయినిస్ కారణంగా 9 వికెట్లు కోల్పోయి చివరి బంతికి విజయాన్ని అందుకుంది..
8 మ్యాచుల్లో 5 విజయాలు అందుకున్న లక్నో సూపర్ జెయింట్స్, పాయింట్ల పట్టికలో టాప్ 2లో ఉంది. 8 మ్యాచుల్లో 4 విజయాలు, 4 పరాజయాలు అందుకున్న ఆర్‌సీబీ, ఆరో స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఆర్‌సీబీ మిగిలిన 6 మ్యాచుల్లో కనీసం నాలుగు మ్యాచులు గెలవాలి...
నేటి మ్యాచ్‌లో ఓడితే ఆర్‌సీబీకి ప్రతీ మ్యాచ్ డూ ఆర్ డైగా మారొచ్చు. బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లిసిస్ తప్ప మరో బ్యాటర్ రాణించకపోవడం, బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్ ఒక్కడిపైనే భారం వేయడంతో ఆర్‌సీబీపై ఆశలు లేవు...
గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 257 పరుగుల భారీ స్కోరు చేసింది లక్నో సూపర్ జెయింట్స్. కైల్ మేయర్స్, ఆయుష్ బదోనీ, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ కలిసి దంచికొట్టారు. అలాంటి హై స్కోరింగ్ మ్యాచ్ తర్వాత జరుగుతున్న మ్యాచ్ కావడం, సొంత మైదానంలో బరిలో దిగుతుండడం లక్నోకి బాగా కలిసి రావచ్చు..
గాయం కారణంగా మొదటి 8 మ్యాచుల్లో ఆడని జోష్ హజల్‌వుడ్, నేటి మ్యాచ్ ద్వారా రీఎంట్రీ ఇస్తున్నాడు. అలాగే వరుసగా విఫలమవుతున్న షాబాజ్ అహ్మద్ స్థానంలో అనుజ్ రావత్‌కి తుది జట్టులో చోటు కల్పించింది ఆర్‌సీబీ..
బెంగళూరులో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో చివరి బంతికి సింగిల్ తీసి హెల్మెట్ నేలకు బాది సెలబ్రేట్ చేసుకున్న లక్నో బౌలర్ ఆవేశ్ ఖాన్‌ని తుది జట్టు నుంచి తప్పించింది ఆ టీమ్. అతని స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్‌కి తుది జట్టులో చోటు దక్కింది.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇది: కెఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్, కృష్ణప్ప గౌతమ్, రవి భిష్ణోయ్, నవీన్ ఉల్ హక్, అమిత్ మిశ్రా, యష్ ఠాకూర్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్, అనుజ్ రావత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తీక్, సుయాశ్ ప్రభుదేశాయ్, వానిందు హసరంగ, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, జోష్ హజల్‌వుడ్
