ఐపీఎల్ 2022 సీజన్‌లో నాలుగో విజయం అందుకున్న గుజరాత్ టైటాన్స్... టేబుల్ టాప్ పొజిషన్ చేరిన హార్ధిక్ పాండ్యా టీమ్... జోస్ బట్లర్ మెరుపు హాఫ్ సెంచరీ చేసినా రాజస్థాన్‌కి తప్పని ఓటమి...

గుజరాత్ టైటాన్స్ గత మ్యాచ్ ఓటమి తర్వాత అద్భుతమైన విజయంతో కమ్‌బ్యాక్ ఇచ్చింది. జోస్ బట్లర్ మెరుపులు మెరిపించినా, మిగిలిన బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపించకపోవడంతో రాజస్థాన్ రాయల్స్, సీజన్‌లో రెండో ఓటమిని చవిచూసింది. రాయల్స్‌పై 37 పరుగుల తేడాతో ఘన విజయం అందుకున్న గుజరాత్ టైటాన్స్, నాలుగు విజయాలతో టేబుల్ టాప్ పొజిషన్‌కి చేరుకుంది. 

193 పరుగుల లక్ష్యఛేదనలో రాజస్థాన్ రాయల్స్‌కి మెరుపు ఆరంభం అందించాడు జోస్ బట్లర్. ఇన్నింగ్స్ ప్రారంభమైన 11 బంతుల తర్వాత మొదటి బంతిని ఎదుర్కొన్న దేవ్‌దత్ పడిక్కల్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. యశ్ దయాల్ బౌలింగ్‌లో పడిక్కల్ కొట్టిన షాట్‌ని క్యాచ్‌గా మలిచాడు శుబ్‌మన్ గిల్...

వన్‌డౌన్‌లో వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ 8 బంతుల్లో ఓ సిక్సర్‌తో 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఓ వైపు బౌండరీల మోత మోగించిన జోస్ బట్లర్ 23 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. 24 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన జోస్ బట్లర్, లూకీ ఫర్గూసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఒకే ఓవర్‌లో అశ్విన్, బట్లర్ వికెట్లను కోల్పోయింది రాయల్స్...

11 బంతుల్లో ఓ సిక్సర్‌తో 11 పరుగులు చేసిన సంజూ శాంసన్, కీలక సమయంలో రనౌట్ కాగా రస్సీ వాన్ దేర్ దుస్సేన్ 10 బంతుల్లో 6 పరుగులు చేసి యశ్ దయాల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 17 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 29 పరుగులు చేసిన సిమ్రాన్ హెట్మయర్, మహ్మద్ షమీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

12.5 ఓవర్లలో 116 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్. రియాన్ పరాగ్ 16 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్ బాది 18 పరుగులు చేసి అవుట్ కాగా జేమ్స్ నీశమ్ 15 బంతుల్లో ఓ పోర్‌తో 17 పరుగులు చేశాడు. 

యజ్వేంద్ర చాహాల్ 5 పరుగులు చేసి ఆఖరి ఓవర్‌లో అవుట్ కాగా ప్రసిద్ధ్ కృష్ణ 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. 20 ఓవర్లు ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది రాజస్థాన్ రాయల్స్. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. జేమ్స్ నీశమ్ వేసిన మొదటి ఓవర్‌లో మూడు ఫోర్లు బాదిన మాథ్యూ వేడ్, రెండో ఓవర్‌లో రనౌట్ అయ్యాడు. 6 బంతుల్లో 3 ఫోర్లతో 12 పరుగులు చేసిన మాథ్యూ వడ్, వాన్ దేర్ దుస్సేన్ డైరెక్ట్ త్రోకి పెవిలియన్ చేరాడు...

రెండు మ్యాచుల బ్రేక్ తర్వాత తుదిజట్టులో చోటు దక్కించుకున్న విజయ్ శంకర్ 7 బంతుల్లో 2 పరుగులు చేసి కుల్దీప్ సేన్ బౌలింగ్‌లో శాంసన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

14 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, రియాన్ పరాగ్ బౌలింగ్‌లో హెట్మయర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 53 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది గుజరాత్ టైటాన్స్. ఈ దశలో అభినవ్ మనోహర్, హార్ధిక్ పాండ్యా కలిసి నాలుగో వికెట్‌కి 86 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేసిన అభినవ్ మనోహర్, యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో రవిచంద్రన్ అశ్విన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాదిన డేవిడ్ మిల్లర్, కుల్దీప్ సేన్ వేసిన 19వ ఓవర్‌లో 21 పరుగులు రాబట్టాడు. మొదటి 3 ఓవర్లలో 30 పరుగులిచ్చిన కుల్దీప్ సేన్, ఆఖరి ఓవర్‌లో 21 పరుగులిచ్చి మొత్తంగా 51 పరుగులు సమర్పించాడు.