ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కి రెండో ఓటమి... పంజాబ్ కింగ్స్ చేతుల్లో 8 వికెట్ల తేడాతో ఓడిన హార్ధిక్ పాండ్యా టీమ్... శిఖర్ ధావన్ అజేయ హాఫ్ సెంచరీ...
టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌కి షాక్ ఇస్తూ, కీలక మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది పంజాబ్ కింగ్స్. కష్టం సాధ్యం కాని 144 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించారు పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్, భనుక రాజపక్ష. లక్ష్యం తక్కువగా ఉండడం, చేయాల్సిన రన్ రేట్ స్వల్పంగా ఉండడంతో ఏ మాత్రం తొందర పడకుండా నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను నడిపించారు...
సీజన్‌లో తొలిసారి ఓపెనర్‌గా వచ్చిన జానీ బెయిర్ స్టోన్ 6 బంతులు ఆడి 1 పరుగు మాత్రమే చేసి మహ్మద్ షమీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 10 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది పంజాబ్. రెండో వికెట్‌కి 87 పరుగుల భాగస్వామ్యం నిర్మించిన తర్వాత రాజపక్ష అవుట్ అయ్యాడు. 28 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 40 పరుగులు చేసి ఫర్గూసన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు భనుక రాజపక్ష...
మరోవైపు శిఖర్ ధావన్, ఐపీఎల్ కెరీర్‌లో 47వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖరి 5 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ విజయానికి 27 పరుగులు రావాల్సి రాగా వరుసగా 6,6,6,4,2,4 బాది... 28 పరుగులు రాబట్టి మ్యాచ్‌ని ముగించాడు లియామ్ లివింగ్‌స్టోన్...
10 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో లియామ్ లివింగ్‌స్టోన్ 30 పరుగులు చేయగా శిఖర్ ధావన్ 53 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి దూసుకెళ్లింది పంజాబ్ కింగ్స్...
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్లు కోల్పోయి 143 పరుగుల స్కోరు మాత్రమే చేయగలిగింది. మూడో ఓవర్ తొలి బంతికి శుబ్‌మన్ గిల్ రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. 6 బంతుల్లో 2 ఫోర్లతో 9 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, రిషి ధావన్ వేసిన డైరెక్ట్ త్రోకి పెవిలియన్ చేరాల్సి వచ్చింది...
17 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసిన వృద్ధిమాన్ సాహా, కగిసో రబాడా బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఓపెనర్లు ఇద్దరూ స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరడంతో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కుదురుకోవడానికి సమయం తీసుకోవాలని భావించాడు...
7 బంతులాడి ఒక్క పరుగు చేసిన హార్ధిక్ పాండ్యా, రిషి ధావన్ బౌలింగ్‌లో జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది గుజరాత్ టైటాన్స్. డేవిడ్ మిల్లర్ 14 బంతుల్లో 11 పరుగులు చేసి లియామ్ లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో రబాడాకి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా రాహుల్ తెవాటియా 13 బంతుల్లో 11 పరుగులు చేసి రబాడా బౌలింగ్‌లో సందీప్ శర్మకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
తెవాటియాని అవుట్ చేసిన తర్వాతి బంతికే రషీద్ ఖాన్‌ని గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు కగిసో రబాడా. ఈ సీజన్‌లో రషీద్ ఖాన్‌కి ఇది మూడో డకౌట్, ఓవరాల్‌గా 12వ డక్. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన విదేశీ ప్లేయర్‌గా గ్లెన్ మ్యాక్స్‌వెల్ రికార్డును సమం చేశాడు రషీద్ ఖాన్...
ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో క్రీజులో పాతుకుపోయిన సాయి సుదర్శన్ 42 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఇప్పటిదాకా ఐపీఎల్ 2022 సీజన్‌లో డెత్ ఓవర్లలో సిక్సర్ ఇవ్వని అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో భారీ సిక్స్ బాది.. కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ అందుకున్నాడు సాయి సుదర్శన్...
2 పరుగులు చేసిన ప్రదీప్ సాంగ్వాన్, అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రబాడా వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్ మొదటి బంతికే ఫోర్ బాదిన లూకీ ఫర్గూసన్, ఆ తర్వాతి బంతికి లివింగ్‌స్టోన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సాయి సుదర్శన్ 50 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
