ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా ఏడు మ్యాచుల్లో ఓడిన ముంబై ఇండియన్స్... లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై సారథి రోహిత్ శర్మ...
ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. లక్నో జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెఎల్ రాహుల్ 103 పరుగులతో సెంచరీ చేయడంతో లక్నో 199 పరుగుల భారీ స్కోరు చేసింది. సూర్యకుమార్ యాదవ్, డేవాల్డ్ బ్రేవిస్, తిలక్ వర్మ పోరాడినా ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులకి పరిమితమైంది.
వరుసగా ఏడు మ్యాచుల్లో ఓడిన ముంబై ఇండియన్స్, తొలి విజయం కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నప్పటికీ మిగిలిన 7 మ్యాచుల్లో ఘన విజయాలు అందుకుంటే నెట్ రన్ రేట్ ఆధారంగా ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించే అవకాశం ఉంది.
దీంతో నేటి మ్యాచ్‌తో రోహిత్ సేనకి చావో రేవో తేలిపోనుంది. నేటి మ్యాచ్‌లో ఓడితే అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటుంది ముంబై ఇండియన్స్. మిగిలిన ఆరు మ్యాచుల్లో అద్భుత విజయాలు సాధించినా, ముంబైకి ప్లేఆఫ్స్ చేరే ఛాన్స్ ఉండదు...
మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటిదాకా 7 మ్యాచుల్లో 4 విజయాలు అందుకుని పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. నేటి మ్యాచ్‌లో గెలిస్తే టాప్ 4లోకి దూసుకెళ్తుంది లక్నో సూపర్ జెయింట్స్.. ఆఖరి స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్, నేటి మ్యాచ్ గెలిచినా లాస్ట్ పొజిషన్‌లోనే ఉంటుంది.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ ఆ జట్టును తీవ్రంగా వేధిస్తోంది. రోహిత్‌తో పాటు యంగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. భారీ ఆశలు పెట్టుకున్న ఆల్‌రౌండర్ కిరన్ పోలార్డ్ కూడా ఘోరంగా విఫలమవుతూ ముంబై ఇండియన్స్ పరాజయాలకు కారణమవుతున్నాడు...
యంగ్ ప్లేయర్లు డేవాల్డ్ బ్రేవిస్, తిలక్ వర్మ... ఇప్పటిదాకా ఐపీఎల్ 2022 సీజన్‌లో మంచి పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నారు. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ... హాఫ్ సెంచరీతో ఆకట్టుకుని, ముంబైకి మంచి స్కోరు అందించాడు...
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్‌కి ముంబై ఇండియన్స్‌పై తిరుగులేని రికార్డు ఉంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచుల్లో 24, 94, 71, 100, 17, 77, 60, 21, 103 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, 94.5 సగటుతో రెండు సెంచరీలు, మొత్తంగా నాలుగు సార్లు 75+ స్కోర్లు చేశాడు...
దాదాపు నాలుగేళ్ల తర్వాత సొంత మైదానం వాంఖడే స్టేడియంలో మొట్టమొదటి మ్యాచ్ ఆడుతోంది ముంబై ఇండియన్స్. ఈ సీజన్‌లో వరుస పరాజయాలకు వాంఖడేలో బ్రేక్ వేయాలని ఆశపడుతున్నారు ఫైవ్ టైం టైటిల్ ఛాంపియన్స్...
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, డేవాల్డ్ బ్రేవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కిరన్ పోలార్డ్, హృతిక్ హోకీన్, డానియల్ సామ్స్, జయ్‌దేవ్ ఉనద్కత్, రిలే మెడేరిత్, జస్ప్రిత్ బుమ్రా
లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డి కాక్, కెఎల్ రాహుల్, మనీశ్ పాండే, కృనాల్ పాండ్యా, దీపక్ హుడా, ఆయుష్ బదోనీ, మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, మోస్కిన్ ఖాన్, దుస్మంత ఛమీరా, రవి భిష్ణోయ్
