ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా 8వ మ్యాచ్‌లోనూ ఓడిన ముంబై ఇండియన్స్... ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకున్న ఫైవ్ టైం టైటిల్ విన్నర్... ఇక పరువు కోసం పోరాటం..
ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్, ఫైవ్ టైం టైటిల్ విన్నర్ ముంబై ఇండియన్స్... 2022 సీజన్‌లో ఒక్క విజయం సాధించేందుకు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 169 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించలేక చేతులు ఎత్తేసిన ముంబై ఇండియన్స్... సీజన్‌లో వరుసగా 8వ ఓటమి సాధించి, చెత్త రికార్డు మూటకట్టుకుంది.
అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబై ఇండియన్స్, ఇకపై ఆఖరి స్థానంలో నిలవకుండా ఉండాలంటే మిగిలిన మ్యాచుల్లో గెలిచి పరువు కాపాడుకోవాల్సి ఉంటుంది.
169 పరుగుల లక్ష్యఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ కలిసి శుభారంభం అందించే ప్రయత్నం చేశారు. ఓ వైపు రోహిత్ దూకుడుగా ఆడుతుంటే, ఇషాన్ కిషన్ మాత్రం మరోసారి టెస్టు ఇన్నింగ్స్‌తో విసిగించాడు. 20 బంతులాడి కేవలం 8 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో జాసన్ హోల్డర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
యంగ్ సెన్సేషనల్ డేవాల్డ్ బ్రేవిస్ 5 బంతులాడి 3 పరుగులు చేసి కొత్త కుర్రాడు మోహ్సిన్ ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 31 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 39 పరుగులు చేసిన రోహిత్ శర్మ, కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...
7 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్... ఆయుష్ బదోనీ బౌలింగ్‌లో అవుట్ కావడంతో 67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది ముంబై ఇండియన్స్.
రవి భిష్ణోయ్ వేసిన 14వ ఓవర్లలో 2 సిక్సర్లతో 16 పరుగులు రాబట్టిన తిలక్ వర్మ, హోల్డర్ వేసిన 16వ ఓవర్‌లో రెండు ఫోర్లతో 12 పరుగులు రాబట్టాడు. అయితే మరో ఎండ్‌లో కిరన్ పోలార్డ్ బ్యాటు విదిలించకపోవడంతో రన్‌రేట్ అంతకంతకీ పెరుగుతూ పోయింది...
ముంబై ఇండియన్స్ విజయానికి 4 ఓవర్లలో 59 పరుగులు కావాల్సి రాగా మోహ్సిన్ ఖాన్ వేసిన 17వ ఓవర్‌లో 9 పరుగులు మాత్రమే వచ్చాయి. 27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేసిన తిలక్ వర్మ, జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో రవి భిష్ణోయ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అప్పటికి ముంబై ఇండియన్స్ విజయానికి 13 బంతుల్లో 45 పరుగులు కావాలి...
19వ ఓవర్‌లో 5 పరుగులు రావడంతో, కృనాల్ పాండ్యా వేసిన 20వ ఓవర్ మొదటి బంతికే పోలార్డ్ అవుట్ కావడంతో ముంబై ఓటమి ఖరారైపోయింది. 20 బంతులాడిన పోలార్డ్ ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
మూడో బంతికి జయ్‌దేవ్ ఉనద్కత్ రనౌట్ కాగా ఆఖరి 2 బంతుల్లో పరుగులేమీ రాలేదు. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్ 132 పరుగులకి పరిమితమై 36 పరుగుల తేడాతో పరాజయం పాలైంది...
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగుల స్కోరు చేసింది. 9 బంతుల్లో ఓ సిక్సర్‌తో 10 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్, జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
ఆ తర్వాత మనీశ్ పాండే, కెఎల్ రాహుల్ కలిసి రెండో వికెట్‌కి 58 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 22 బంతుల్లో ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసిన మనీశ్ పండే, కిరన్ పోలార్డ్ బౌలింగ్‌లో రిలే మెడరిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 3 బంతులాడిన పరుగులేమీ చేయలేకపోయిన మార్కస్ స్టోయినిస్... డానియల్ సామ్స్ బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా పెవిలియన్ చేరాడు...
కృనాల్ పాండ్యా 1 పరుగు చేసి కిరన్ పోలార్డ్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. దీపక్ హుడా 9 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేసి రిలే మెడరిత్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో కుదురుకుపోయిన కెఎల్ రాహుల్... ముంబై ఇండియన్స్‌పై 800+ పరుగులు పూర్తి చేసుకున్నాడు...
ముంబై ఇండియన్స్‌పై 8వ 50+ స్కోరు నమోదు చేసిన కెఎల్ రాహుల్, ఆ జట్టుపై అత్యధిక హాఫ్ సెంచరీ స్కోర్లు చేసిన బ్యాటర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతకుముందు సురేష్ రైనా 7 సార్లు ముంబై ఇండియన్స్‌పై 50+ స్కోర్లు నమోదు చేయగా డేవిడ్ వార్నర్, క్రిస్ గేల్, మనీశ్ పాండే, శిఖర్ ధావన్ ఆరేసి సార్లు ఈ ఫీట్ సాధించారు...
జయ్‌దేవ్ ఉనద్కత్ వేసిన 18వ ఓవర్‌లో ఆఖరి 3 బంతుల్లో హ్యట్రిక్ ఫోర్లు బాదిన కెఎల్ రాహుల్... జస్ప్రిత్ బుమ్రా వేసిన 19వ ఓవర్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే రాబట్టగలిగాడు.
రిలే మెడరిత్ వేసిన 20వ ఓవర్ మొదటి బంతికి సిక్సర్ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెఎల్ రాహుల్‌కి ఐపీఎల్‌లో ఇది నాలుగో సెంచరీ. క్రిస్ గేల్ 6 ఐపీఎల్ సెంచరీలతో, విరాట్ కోహ్లీ 5 సెంచరీలతో కెఎల్ రాహుల్ కంటే ముందున్నారు.
11 బంతుల్లో ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేసిన ఆయుష్ బదోనీ... మెడిరిత్ బౌలింగ్‌లో పోలార్డ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కెఎల్ రాహుల్ 62 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 103 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
