IPL 2022 GT vs MI: 43 పరుగులు చేసిన రోహిత్ శర్మ, 45 పరుగులు చేసిన ఇషాన్ కిషన్... మరోసారి తీవ్రంగా నిరాశపరిచిన కిరన్ పోలార్డ్...
ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్న రోహిత్ శర్మ, ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 150+ స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేసి, ఫ్యాన్స్‌ని ఖుషీ చేశాడు. రోహిత్ శర్మకి తోడు మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా బ్యాటు ఝలిపించడంతో ముంబై ఇండియన్స్ మంచి స్కోరు చేయగలిగింది... టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగుల స్కోరు చేసింది.
మహ్మద్ షమీ వేసిన తొలి ఓవర్‌లో 5 పరుగులే రాగా అల్జెరీ జోసఫ్ వేసిన 2వ ఓవర్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాది 14 పరుగులు రాబట్టాడు రోహిత్ శర్మ. రషీద్ ఖాన్ వేసిన 5వ ఓవర్‌లో ఇషాన్ కిషన్ కూడా బౌండరీలు బాదడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...
ఐపీఎల్ 2022 సీజన్‌లో పవర్ ప్లేలో ముంబైకి ఇదే అత్యుత్తమ స్కోరు. పవర్ ప్లేలో రోహిత్ శర్మ 42 పరుగులు చేయడం కూడా ఇదే తొలిసారి. ఇంతకుముందు 2019లో పంజాబ్‌పై 32 పరుగులే రోహిత్‌కి పవర్ ప్లేలో అత్యుత్తమ స్కోరు...
28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేసిన రోహిత్ శర్మ, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా డీఆర్‌ఎస్ తీసుకున్న గుజరాత్‌కి అనుకూలంగా ఫలితం వచ్చింది...
11 బంతుల్లో ఓ సిక్సర్‌తో 13 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, ప్రదీప్ సాంగ్వాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 29 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 45 పరుగులు చేసిన మరో ఓపెనర్ ఇషాన్ కిషన్, అల్జెరీ జోసఫ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
డేంజరస్ బ్యాట్స్‌మెన్ కిరన్ పోలార్డ్ 14 బంతులు ఆడినా 4 పరుగులు మాత్రమే చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు... వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయింది ముంబై ఇండియన్స్...16 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేసిన యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ, రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు...
లూకీ ఫర్గూసన్ బౌలింగ్‌లో డీఆర్‌ఎస్ తీసుకున్నా అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న డానియల్ సామ్స్, ఆ తర్వాతి బంతికే రషీద్ ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసిన రషీద్ ఖాన్, ఫీల్డర్‌గా మూడు క్యాచులు అందుకోవడం విశేషం.
టిమ్ డేవిడ్ 21 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 44 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో ఈ మాత్రం స్కోరు చేయగలిగింది ముంబై ఇండియన్స్. ఇప్పటిదాకా ఐపీఎల్ 2022 సీజన్‌లో ఛేదనలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు గుజరాత్ టైటాన్స్... ఓడిన రెండు మ్యాచులు కూడా మొదట బ్యాటింగ్ చేసినవే కావడం విశేషం. దీంతో నేటి మ్యాచ్‌ను ముంబై ఎలా కాపాడుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
